విద్యార్థులకు పాఠంగా నిజామాబాద్ ఎన్నికలు.. సిలబస్‌లో చేర్చాలంటూ..

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక.. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి, 2019 లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ప్రత్యేకతను చాటుకుంది. ఎందుకంటే దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు ఈ స్థానం నుంచి పోటీ చేశారు మరి.

news18-telugu
Updated: May 8, 2019, 2:56 PM IST
విద్యార్థులకు పాఠంగా నిజామాబాద్ ఎన్నికలు.. సిలబస్‌లో చేర్చాలంటూ..
(ఫైల్ ఫోటో)
  • Share this:
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక.. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి, 2019 లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ప్రత్యేకతను చాటుకుంది. ఎందుకంటే దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు ఈ స్థానం నుంచి పోటీ చేశారు మరి. పోటీ చేయడం ఒక ఎత్తు అయితే, ఎన్నికల నిర్వహణ మరో ఎత్తు. 185 మంది అభ్యర్థులకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. అతి తక్కువ సమయంలో ఓటర్లకు ఇబ్బంది కాకుండా విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారు. అయితే, ఇంతటి ఘనత సాధించిన ఈ ఎన్నికల విధానాన్ని మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు కేస్‌ స్టడీగా చెప్పాలంటూ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)ను ఎన్నికల సంఘం అధికారులు సంప్రదించారు. ‘నిజామాబాద్‌ ఎన్నిక గురించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌తో పాటు ఐఎస్‌బీని సంప్రదించాం. సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో కేస్‌ స్టడీగా ఈ ఎన్నికను ఉపయోగించాలని కోరాం. లాజిస్టిక్స్‌ పరంగా ఈ ఎన్నిక చాలా పెద్ద ప్రక్రియ’ అని ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ ఎన్నికల కోసం దాదాపు 27వేల బ్యాలెట్‌ యూనిట్లను ఉపయోగించామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

కాగా, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు నిజామాబాద్‌లో 178 మంది పసుపు రైతులు పోటీ చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, బీజేపీ నుంచి అరవింద్‌, కాంగ్రెస్‌ తరఫున మధుయాష్కీ సహా మొత్తం 185 మంది బరిలో నిలిచారు. లోక్‌సభ తొలి దశ పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్‌ 11న నిజామాబాద్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 12 ఈవీఎంలను ఉపయోగించారు. మరోవైపు, ఈ నెల 23న వెలువడే ఫలితాలకు గానూ నిజామాబాద్‌లో ఓట్ల లెక్కింపునకు 18 టేబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. కానీ అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో టేబుల్స్‌ సంఖ్యను పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
First published: May 8, 2019, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading