news18-telugu
Updated: December 8, 2018, 6:24 PM IST
ఉత్తమ్, కేటీఆర్
తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది ఎవరు ? ఇప్పుడు దాదాపుగా ప్రజలందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. సైలెంట్‌గా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేసి వచ్చిన ఓటరు ఎవరికి పట్టడం కట్టారనే విషయం ఎవరికీ తెలియడం లేదు. తలపండిన రాజకీయ విశ్లేషకులు, ఎన్నో ఎన్నికల్లో సర్వేలు చేసిన సెఫాలజిస్టులు కూడా తెలంగాణ ఫలితాలను అంచనా వేయలేకపోతున్నారు. జాతీయ మీడియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎక్కువ శాతం టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పడంతో... మరోసారి కేసీఆర్ గెలుపు పక్కా అని చాలామంది భావించారు. కానీ అంతలోనే నేనున్నానంటూ తెరపైకి వచ్చిన ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్... కేసీఆర్ ఓటమి ప్రజాకూటమి గెలుపు ఖాయమంటూ సర్వే ఫలితాలను వెల్లడించడంతో మరోసారి రాజకీయవర్గాలు, ప్రజల్లో ఎవరు గెలుస్తారనే చర్చ జోరందుకుంది.

లగడపాటి రాజగోపాల్ (ఫైల్ ఫొటో)

లగడపాటి రాజగోపాల్ చెప్పడం వల్లే నమ్మకం పెరిగిందో లేక నిజంగానే తాము కచ్చితంగా గెలుస్తామని నమ్ముతున్నారో తెలియదు కానీ... కాంగ్రెస్ నేతలు కూడా తమకు 70 సీట్లు వస్తాయని కుండబద్ధలుకొట్టినట్లు చెబుతున్నారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నా గడ్డం తీసే సమయం అసన్నమైందని అనేశారు. ప్రజా కూటమికి 80 స్థానాలు పక్కా అంటూ ఆయన ధీమా వ్యక్తంచేస్తున్నారు.

ఇక గెలుపుపై మొదటి నుంచి ధీమాగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్... వంద సీట్లు గెలుస్తామంటూ మరోసారి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 11న ఫలితాలు వెలువడిన తరువాత సంబరాలు చేసుకుందామని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటికి ఎన్నికల ఫలితాల తర్వాత సర్వేల సన్యాసం ఖాయమని అన్నారు.

కేటీఆర్ (File)
గెలుపు విషయంలో ఇంతగా ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు... 11 వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం గమనార్హం. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై కాంగ్రెస్ కార్యకర్తలు దృష్టి పెట్టాలని... ఈవీఎంలను మార్చే అవకాశం ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక వంద సీట్లు కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్ సైతం ఇంచుమించుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈవీఎంలపై ఆయన ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా... ఫలితాలు వెలువడే 11వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని నేతలకు, కార్యకర్తలకు సూచించారు. చివరి ఓటు లెక్క తేలిన తరువాతే సంబరాలు చేసుకుందామని అన్నారు.

ఉత్తమ్, కేటీఆర్
మా గెలుపు ఖాయమంటున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు... కొన్ని విషయాలపై స్పందించిన తీరును బట్టి ప్రజల్లోనూ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికల్లో కచ్చితంగా ఎవరో ఒకరే గెలుస్తారు. ఈ విషయం ఈ పార్టీల నాయకులకు తెలియనిది కాదు. అలాగని ముందే ఓటమిని కూడా ఎవరూ అంగీకరించరు. అయితే తమలో గెలుపు ఎవరిది ? ఓడిపోయేది ఎవరనే విషయం వీరికి కచ్చితంగా తెలిసే ఉంటుందనేది జనం మాట. ఆ లెక్కన వీరిలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది ఎవరు ? నిజంగా గెలుస్తామని నమ్మకంగా ఉన్నది ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. మరి అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే... మరెంతో దూరంలో లేని 11వ తేదీ వరకు ఓపిగ్గా ఎదురుచూస్తే సరిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ.
Published by:
Kishore Akkaladevi
First published:
December 8, 2018, 5:28 PM IST