టీఆర్ఎస్‌ ఆశల్ని ప్రజాకూటమి గల్లంతు చేస్తుందా?

Telangana Election 2018 | తెలంగాణలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, టీడీపీ క్రమంగా పుంజుకుంటున్నాయి. రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఎక్కువ పార్టీల అభ్యర్థులు పోటీ చెయ్యడం కూడా ప్రజాకూటమికి కలిసొచ్చే అంశమే.

news18-telugu
Updated: December 4, 2018, 11:24 AM IST
టీఆర్ఎస్‌ ఆశల్ని ప్రజాకూటమి గల్లంతు చేస్తుందా?
మహాకూటమి నేతలు (ఫైల్ ఫోటో)
  • Share this:
(కృష్ణకుమార్ : న్యూస్18 తెలుగు)

బద్ధశత్రువులైన కాంగ్రెస్, టీడీపీ చేతులు కలిపి... టీజేఎస్, సీపీఐని తమతో కలుపుకొని ప్రజాకూటమిగా ఏర్పడినప్పుడు ప్రజల్లో ఎన్నో సందేహాలు తలెత్తాయి. అసలీ కూటమికి సీట్ల సర్దుబాటు సాధ్యమవుతుందా అన్నది కీలక ప్రశ్న. బీజేపీ, టీఆర్ఎస్ లాగా ఈ కూటమి కామన్ అజెండాతో జనంలోకి వెళ్తుందా అన్నది మరో ప్రశ్న. అసలీ పార్టీలు ఓటు బ్యాంకును తమ మధ్య బదిలీ చేసుకోగలవా అన్న ప్రశ్న కూడా ఉదయించింది. వాస్తవంలో ఈ ప్రశ్నలన్నీ పటాపంచలయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు నెలలుగా క్షేత్రస్థాయిలో ప్రజాకూటమి బలం పెరుగుతోందని అంచనా వేస్తున్నారు. ఇటీవల వస్తున్న సర్వేల ఫలితాలు, సట్టా మార్కెట్‌లో ప్రజాకూటమిపై పెరుగుతున్న పందేలు, టీఆర్ఎస్‌పై ప్రజల్లో గూడుకట్టుకుంటున్న వ్యతిరేకత వంటివి మహాకూటమి బలం పెరుగుతోందని సూచిస్తున్నాయి.

telangana congress leaders uttam, batti, kuntina met tdp chief chandrababu
భట్టి విక్రమార్క, రాహుల్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)


సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసిన సీఎం కేసీఆర్... ముందస్తు ఎన్నికలకు సమరశంఖం పూరించారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికలతోనే వాటిని జరిపించే ఛాన్సుంది. 119 స్థానాలున్న అసెంబ్లీని రద్దు చేసినప్పుడు టీఆర్ఎస్ బలం 90 సీట్లుగా ఉండగా, కాంగ్రెస్ 13, టీడీపీ 3 సీట్లతో మాత్రమే ఉన్నాయి. ఐతే 2014 ఎన్నికల ఫలితాలప్పుడు టీఆర్ఎస్ 63 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ 21, టీడీపీ 15 స్థానాల్ని కైవసం చేసుకున్నాయి. ఈ నాలుగేళ్లలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు చాలామంది... టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి... పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు.

పార్టీకి ఎమ్మెల్యేల బలం పెరిగిందని భావించిన కేసీఆర్... అదే కాన్ఫిడెన్స్‌తో తాము వంద సీట్లు గెలుస్తామని అంటున్నారు. మూడు నెలల కిందట అప్పటి పరిస్థితులు కూడా టీఆర్ఎస్‌ విజయం ఖాయమన్నట్లు కనిపించాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొన్ని వారాలుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోయాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ మహా అయితే 65-66 సీట్లు గెలవగలదని ఎంఐఎంతో కలిసి పనిచేసిన ఓ పొలిటికల్ ఎనలిస్ట్ అంచనా వేశారు. ఇందుకు ప్రజాకూటమి పార్టీలు జట్టుగా కలిసుండటం, ప్రభుత్వ వ్యతిరేకత కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తాను ఈ అభిప్రాయానికి వచ్చానన్నారు.

ప్రజాకూటమి రాత్రికి రాత్రి దూసుకురాలేదు. ఐతే, ఇది ఏర్పడినప్పటి నుంచే తెలంగాణలో దీనికి పాజిటివ్ సంకేతాలు మొదలయ్యాయి. ఉత్తర తెలంగాణ లాంటి ఎక్కువ పార్టీలు పోటీ చేసే చోట ప్రజాకూటమికి కలిసొస్తుందనే భావన బలపడుతోంది.

మహబూబ్‌నగర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి
మహబూబ్‌నగర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి
బీజేపీ ఫ్యాక్టర్ :
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన తేడా ఒకటుంది. అదే బీజేపీ. ఇదివరకు చాలా తక్కువ స్థానాల్లో బరిలో దిగిన ఆ పార్టీ ఈసారి మాత్రం 119లో 118 స్థానాల్లో పోటీ చేస్తోంది.

చాలా మంది చెబుతున్నట్లు తెలంగాణలో బీజేపీ మరీ అంత వీక్‌గా ఏమీ లేదు. ఆ పార్టీకి ఇక్కడ 7-9 శాతం ఓట్లున్నాయి. లేటుగా ప్రచారం ప్రారంభించినా, ఆ పార్టీ కూడా పాజిటివ్ సంకేతాలతో ముందుకెళ్తోంది. చాలా పద్ధతిగా తనపని తాను చేసుకుపోతోంది. చూస్తుంటే ప్రస్తుతం ఉన్న 5 సిట్టింగ్ స్థానాలకు అదనంగా మరో 2 గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తోపాటూ స్వామి పరిపూర్ణానంద వంటి వాళ్లు బీజేపీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

బీజేపీ ఎంతలా బలపడితే టీఆర్ఎస్ ఓట్లకు అంతలా గండి తప్పదన్న సంకేతాలున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యా వ్యూహాత్మక ఒప్పందం ఉందన్న ప్రచారమే దీనికి కారణం. 2014లో తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్‌కి కలిసొచ్చింది. ఇప్పుడది లేదు. అప్పట్లో కేంద్రంలో యూపీఏ-2 ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంతో... తెలంగాణలో కాంగ్రెస్‌పై ఆ ప్రభావం పడింది. ఇప్పుడు టీడీపీతో జతకట్టిన కాంగ్రెస్... ప్రజాకూటమిగా దక్షిణ తెలంగాణలో ఎక్కువ నియోజకవర్గాల్ని గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓట్లపరంగా చూస్తే, తెలంగాణను మూడుగా విభజించవచ్చు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువ మంది సీమాంధ్ర ప్రజలే. వాళ్లు అక్కడి 16 నియోజకవర్గాల్ని ప్రభావితం చెయ్యగలరు. వాళ్లలో ఎక్కువ మంది ఓటు వేసేది టీడీపీకే. టీఆర్ఎస్ నేతలు మాటలు, ప్రవర్తనను పరిశీలిస్తే... వాళ్లకు ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని ఓ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

టీఆర్ఎస్ గనక మళ్లీ అధికారంలోకి రాకపోతే, రాజకీయ సన్యాసం తీసుకుంటాను - కేటీఆర్


టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే, ఫాంహౌస్‌కి వెళ్లి పడుకుంటాను - కేసీఆర్


దీనికి తోడు ఓ ముస్లిం రిజర్వేషన్లపై ఓ ఓటర్ ప్రశ్నించినప్పుడు కేసీఆర్ అతనిపై మండిపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముస్లిం ఓటర్లకు టీఆర్ఎస్‌పై ఆగ్రహం వచ్చేందుకు ఈ వీడియో ఊతమిస్తోంది.

AP CM chandrababu meets west bengal cm mamata banerjee in kolkata and discusses on anti bjp front బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన చంద్రబాబు కూటమి ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ చేతులు కలపాల్సిన అవసరం ఉందని ఆమెతో చెప్పారు. సమావేశంతో చంద్రబాబుతో పాటు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి పాల్గొన్నారు.
మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ (ఫైల్ ఫొటో)


ఓట్ల బదిలీ, జాతీయ అంశాలు :
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమికి 40 శాతం ( కాంగ్రెస్ (25.2)+ టీడీపీ (14.7)+ సీపీఐ) ఓట్లు దక్కాయి. టీఆర్ఎస్‌ (34.3), దాని మిత్రపక్షం ఎంఐఎం (3.8) కలిసి 40 శాతం కంటే తక్కువ ఓట్లు సాధించాయి. అది కూడా తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్న సమయంలో. అప్పట్లో టీఆర్ఎస్‌కి వ్యతిరేకత అన్నది లేదు. 2019 సాధారణ ఎన్నికల్లో ఈ ఫార్ములా పనిచేస్తుందా అంటే అది వేరే విషయం. ప్రజాకూటమి గెలిస్తే, అది కాంగ్రెస్‌కి పునరుత్తేజం తెస్తుంది. అయినప్పటికీ జాతీయస్థాయిలో ప్రభావితం చెయ్యడం కష్టం. యూపీలో అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి వాళ్లు చేతులుకలుపుతున్నారే తప్ప... కాంగ్రెస్‌తో కలిసేందుకు ఇష్టపడట్లేదు. ఎక్కడిదాకో ఎందుకు ప్రజాకూటమి గెలిస్తే, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభావం చూపే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది.

ప్రజాకూటమి విజయం జాతీయస్థాయిలో పార్టీల అధినేతలు కూటములకు ఆకర్షితులయ్యేలా చెయ్యగలదు. చంద్రబాబుకి కూడా ఇది కలిసొచ్చే అంశం. జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనుకుంటున్న ఆయనకు... ఇతర పార్టీల నేతలు ఎర్రతివాచీ పరుస్తారు. ఇప్పటికే ఎన్సీపీ నుంచీ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచీ ఫరూక్ అబ్దుల్లా వంటి వారు చంద్రబాబుతో జట్టు కట్టారు. ప్రజాకూటమి సక్సెస్ అయితే, సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి, చేవెళ్ల లాంటి లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా ఆ కూటమి టీఆర్ఎస్ స్థానాలకు గండి కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌‌కి 15కి, ఎంఐఎంకి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి.

Video : తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదు: అమిత్ షా


Published by: Krishna Kumar N
First published: December 4, 2018, 10:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading