తెలంగాణ ఎన్నికలు 2018 : మీ సర్వేలకో దండం

Telangana Election 2018 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ సర్వేల కలకలం ఎక్కువైపోతోంది. పార్టీలు, అభ్యర్థులు, ప్రైవేట్ సంస్థలు, మీడియా ఇలా ఎవరికి వాళ్లు సర్వేలు చేయించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల ప్రజానాడిని పట్టేశామంటూ, వాటి ఫలితాల్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి వీటిలో ఏ సర్వే నిజం? ఏది అబద్ధం? అసలు సర్వేలు జనాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయా?

news18-telugu
Updated: December 3, 2018, 4:53 PM IST
తెలంగాణ ఎన్నికలు 2018 : మీ సర్వేలకో దండం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(వ్యాసకర్త - కృష్ణకుమార్, న్యూస్18 తెలుగు)

ఈమధ్య ఏ ఇద్దరు కలిసినా సర్వేల గురించే చర్చ. తమ పార్టీ గెలుస్తుందంటే, తమ పార్టీయే గెలుస్తుందంటూ... ఫలానా సర్వేలో ఇలాంటి ఫలితాలొచ్చాయి, ఫలానా ఛానెల్ ఈ పార్టీ గెలుస్తుందని చెప్పింది అంటూ వాదించుకుంటున్నారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కచ్చితంగా వంద కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ పార్టీ పదే పదే చెబుతోంది. తాము చేయిస్తున్న సర్వేల్లో ఇదే విషయం స్పష్టమవుతోందని కుండబద్దలు కొడుతోంది. అదే సమయంలో 99 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్... 70 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామనీ, తాము చేయిస్తున్న సర్వేల్లో రోజురోజుకూ తమ గ్రాఫ్ పెరుగుతోందని చెబుతోంది. ఈ రెండు పార్టీలూ వేటికవే తమ సర్వేనే నిజమైనదని చెప్పుకుంటున్నాయి. బహిరంగ సభలు, రోడ్ షోలలో అదే విషయాన్ని గుచ్చి గుచ్చి చెబుతున్నాయి. రెండు పార్టీల సర్వేలూ నిజమయ్యే పరిస్థితి లేదు. ఒకటి నిజమైతే, రెండోది అబద్ధం కావాల్సిందే. లేదంటే రెండూ రాంగ్ సర్వేలే అయినా ఆశ్చర్యం అక్కర్లేదు.

ప్రస్తుతం రకరకాల సర్వేలు వస్తున్నాయి. జనరల్‌గా సర్వే ఏజెన్సీలు నిరంతరం అదే పనిగా సర్వేలు చేస్తుంటాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వాటితో సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. మీడియా ఛానెళ్ల సర్వేలు ఎన్నికలప్పుడు మోత మోగిస్తాయి. వీటికి తోడు రాజకీయ పార్టీలు సొంత సర్వేలు చేయించుకుంటున్నాయి. నియోజకవర్గాల వారీగా, అభ్యర్థుల వారీగా, కులాలు, మతాల వారీగా సర్వేల సమాచారం తెప్పించుకుని విశ్లేషించుకుంటున్నాయి. ఇందులో ప్రజానాడిని వడపోత పట్టిన సర్వేలకంటే... వండివార్చిన గారడీ లెక్కలే ఎక్కువ.

వీటికి తోడు ఇంటెలిజెన్స్ సంస్థల సర్వేలు, జర్నలిస్టుల సర్వేలు, విద్యార్థి సంఘాల సర్వేలు... ఇలా రకరకాలున్నాయి. వీటిలో చాలా వరకు క్షేత్రస్థాయిలో ప్రజా నాడిని ప్రతిబింబించేవి కావు. వెయ్యి మందిలో ఓ పది మందిని పైపైన అభిప్రాయాలు అడిగి... అదే మొత్తం జనాభా అభిప్రాయంగా ప్రజలపై రుద్దే సర్వేలే ఎక్కువ.


Telangana, Telangana Election, Telangana Elections 2018, Telangana News, Telangana latest News, Telangana Election News, Telangana Election Results, Telangana Election Surveys, తెలంగాణ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికల సర్వే
ప్రతీకాత్మక చిత్రం


సర్వేలా తఢాఖా:
మొన్నామధ్య ఓ సర్వే ఫలితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఆయా పార్టీలు గెలిచిన సీట్ల సంఖ్య (120)... మొత్తం అసెంబ్లీ స్థానాల (119) కంటే ఎక్కువగా ఉందంటే సర్వేల అత్యుత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. మరో దారుణమైన విషయమేంటంటే... ఒక సర్వేకూ, మరో సర్వేకూ ఏమాత్రం పొంతన ఉండట్లేదు. కొద్దోగొప్పో తేడా ఉంటే... జనం కూడా నమ్మగలరు. పూర్తి విరుద్ధమైన వాటిని నమ్మమంటే ఎందుకు నమ్మాలన్న ప్రశ్న ఓటర్ల నుంచీ వస్తోంది.పార్టీల మైండ్ గేమ్ :
దశాబ్దం కిందటి వరకూ సర్వేలపై ప్రజలకు సదభిప్రాయం ఉండేది. అప్పట్లో ఒకట్రెండు సర్వేలు మాత్రమే వచ్చేవి. అవి కూడా కాకిలెక్కలు కాకుండా, ఎంతో లోతుగా అధ్యయనం చేశాకే విడుదల అయ్యేవి. ఎన్నికల ఫలితాలు కూడా వాటికి దాదాపు సరిపోలినట్లు వచ్చేవి. ఇప్పుడు జరుగుతున్న సర్వేల్లో చాలా వరకూ రాజకీయ పార్టీల మైండ్ గేమ్‌లో భాగంగానే కనిపిస్తున్నాయి.

సర్వే చేయించుకుంటున్న పార్టీలు... వాస్తవ పరిస్థితుల కంటే, తమకు అనుకూలంగా సర్వే రిజల్ట్స్ వచ్చేలా చేయించుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఆ ఫలితాలతో ప్రజల్లోకి వెళ్లి... వాటినే జనంపై రుద్దుతూ, ప్రజాభిమానాన్ని పొంది, తమకే ఓట్లు వేసేలా చేయించుకుంటున్నారనే వాదన బలపడుతోంది. ముఖ్యంగా తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం, ప్రత్యర్థులను మానసికంగా దెబ్బకొట్టడం సర్వేల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


Telangana, Telangana Election, Telangana Elections 2018, Telangana News, Telangana latest News, Telangana Election News, Telangana Election Results, Telangana Election Surveys, తెలంగాణ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికల సర్వే
ప్రతీకాత్మక చిత్రం


ఫేక్ సర్వేలే ఎక్కువ:
సర్వేలతో వచ్చిన మరో సమస్యేంటంటే... కొన్ని సర్వేలు అసలు చెయ్యకుండానే చేసినట్లుగా సృష్టిస్తున్నారు ఆకతాయిలు. సోషల్ మీడియాలో ఫలానా సర్వేలే ఇలా వచ్చింది అంటూ షేరింగ్స్ చేస్తున్నారు. అసలా సర్వే ఎవరు చేశారో, ఎప్పుడు చేశారో ఏ వివరాలూ ఉండవు. కానీ దానిపై చర్చ జరిగి, షేరింగ్స్ అయ్యి, అదే నిజం అన్నట్లు ప్రచారం ఊపందుకుంటోంది. ఇలాంటి పనికిమాలిన సర్వేలు ఎందుకూ ఉపయోగం లేకపోగా, ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయి.

లగడపాటి సర్వేలపైనా విమర్శలు :
ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్న సమయంలో... మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వేలకు అంతో ఇంతో ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడీ ఆంధ్రా అక్టోపస్ సర్వేలను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇన్నాళ్లూ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన... సడెన్‌గా మీడియాలో ప్రత్యక్షమై సర్వే ఫలితాలు చెబుతుండటంతో వాటిని నమ్మే విషయంలో జనం సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రెబల్ అభ్యర్థులు ఎక్కువగా గెలుస్తారని ఆయన చెప్పడంతో పార్టీలకు, వాటి కార్యకర్తలకు కూడా ఆ ఫలితాలు రుచించట్లేదు.

Telangana, Telangana Election, Telangana Elections 2018, Telangana News, Telangana latest News, Telangana Election News, Telangana Election Results, Telangana Election Surveys, తెలంగాణ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికల సర్వే
ప్రతీకాత్మక చిత్రం


సర్వేలకు ముకుతాడు వెయ్యాల్సిందే :
రాన్రానూ ఏది నిజమైన సర్వేనో, ఏది పక్షపాత వైఖరితో చేయించినదో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. సర్వేలపై నమ్మకం సడలిపోతుండటంతో అవంటేనే జనానికి మొహం మొత్తేస్తోంది. సర్వేలతో జరుగుతున్న తంతును గ్రహిస్తున్న ఓటర్లు... వాటిని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు. అలాగని వీటిపై నియంత్రణ లేకపోతే కష్టమే. ఎందుకంటే ఇవి ఓటర్ల స్వయం నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నాయి. ఓ అబద్ధాన్ని పదే పదే నిజమని చెబితే, చివరకు అదే నిజం అని జనం నమ్ముతారని ఈ సర్వేరాయుళ్లు భావిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య విలువల్ని పాతరేయడమే... ఓటర్ల వివేచనను కించపరచడమే. అందుకే సర్వేల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కచ్చితమైన నిబంధనలు రూపొందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. సర్వేలను కట్టడి చెయ్యకపోతే, అసలుకే మోసం వస్తుందంటున్నారు ప్రజాస్వామ్యవాదులు.
Published by: Krishna Kumar N
First published: December 3, 2018, 4:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading