Telangana Congress: 'హుజూరాబాద్‌'పై మరింత ఆలస్యం చేయనున్న కాంగ్రెస్.. వ్యూహాత్మకమా ?

హుజూరాబాద్ (ప్రతీకాత్మక చిత్రం)

Huzurabad: హుజూరాబాద్‌లో అభ్యర్థి ఎంపిక విషయంలో సీనియర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

  • Share this:
    తెలంగాణ రాజకీయాలన్నీ ఎక్కువగా హుజూరాబాద్ చుట్టే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్‌.. హుజూరాబాద్‌లో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ తరపున మాజీమంత్రి ఈటల రాజేందర్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంటే.. ఆయనను ఓడించేందుకు టీఆర్ఎస్ అంతకంటే ఎక్కువగా శ్రమిస్తోంది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? జరిగితే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై తెలంగాణవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో గెలుపు వ్యూహాన్ని ఇంకా ఖరారు చేయని కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిన్న గాంధీభవన్‌లో ఈ అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కీలక భేటీ నిర్వహించారు. సమావేశంలో మిగతా అంశాలు కూడా చర్చించినప్పటికీ.. ఎక్కువగా హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపైనే చర్చించారు. హుజూరాబాద్‌లో ఎవరు బరిలోకి దిగాలనే దానిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దామోదర రాజనర్సింహ సారథ్యంలోని కమిటీ ఐదుగురు పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మాజీమంత్రి కొండా సురేఖ పేరును ఖరారు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందనే వార్తలు వచ్చినా.. దీనిపై ఇంకా ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేదని అర్థమవుతోంది.

    అభ్యర్థి ఎంపికను ఈ నెల 10వ తేదీ లోపు పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఓ వైపు టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి ఎంపిక ప్రక్రియ దగ్గరే ఆగిపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాతే అభ్యర్థిని ప్రకటించాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉందని.. అందుకే ఈ రకంగా వ్యూహాత్మకమైన జాప్యం చేస్తోందనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

    Revanth Reddy: ఇదేం పద్ధతి.. రేవంత్ రెడ్డికి సీనియర్ నేత షాక్.. కీలక నేత ముందే అసంతృప్తి..

    Sweat Benefits: వాసన భరించలేకపోయినా.. చెమటలు మంచివే.. ఎన్నో ప్రయోజనాలు.. కానీ..

    మరోవైపు హుజూరాబాద్‌లో అభ్యర్థి ఎంపిక విషయంలో సీనియర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో కొండా సురేఖతోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ పేరు మరోసారి తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా.. ఈ విషయంలో ప్రకటన మాత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాతే ఉండొచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో వెనుకబడినట్టు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంత ఆలస్యం ఎందుకు చేస్తోందనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published: