తెలంగాణలో కాంగ్రెస్ ఆశలన్నీ ఈ ఐదు సీట్లపైనే...

కాంగ్రెస్ ఎన్నికల గుర్తు

తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నా... ఆ పార్టీ ఆశలన్నీ ఐదు స్థానాలపైనే అని తెలుస్తోంది.

  • Share this:
    అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తరువాత టీఆర్ఎస్ దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. అదే జోష్‌తో హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని లోక్ సభ స్థానాలను గెలుచుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక తెలంగాణలో కోలుకుని తమ సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ సైతం... సీనియర్లందరినీ బరిలోకి దింపి లోక్ సభ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నా... ఆ పార్టీ అసలు టార్గెట్ మాత్రం ఐదు స్థానాలే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదు స్థానాలను గెలుచుకోవడంపైనే హస్తం పెద్దలు ఫోకస్ చేశారు.

    తెలంగాణలోని నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, చేవేళ్ల, మల్కాజ్ గిరి స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహాలు రచించింది. ఈ ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఇంకా బలంగానే ఉందనే అంచనాకు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు... ఇక్కడ పోటీలో బలమైన అభ్యర్థులను నిలపాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి, నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చేవేళ్ల నుంచి విశ్వేశ్వర్ రెడ్డిలను పోటీలో నిలిపింది. ఇక ఖమ్మం నుంచి మరోసారి రేణుకా చౌదరి బరిలోకి దిగారు.

    మిగతా స్థానాల్లో పోటీ ఎలా ఉన్నా... ఈ ఐదు నియోజకవర్గాల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీకి ఆశలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ ఐదు స్థానాల్లో కనీసం మూడు స్థానాలు గెలుచుకున్నా... తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. మొత్తానికి తెలంగాణలో మళ్లీ పార్టీని నిలబెట్టుకోవడంతో పాటు లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ...టీఆర్ఎస్, బీజేపీలను తట్టుకుని అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
    First published: