Home /News /politics /

TELANGANA CONGRESS STARTED FACING TROUBLES IN THE 2022 WITH MLA JAGGA REDDY AK

Telangana Congress: జగ్గారెడ్డి జగడం... 2022లో కాంగ్రెస్‌కు అప్పుడే మొదలైందా ?

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

Jagga Reddy: జగ్గారెడ్డి వ్యాఖ్యలను బట్టి సీనియర్ నేతలంతా కలిసి రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని గట్టిగా డిసైడయ్యారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

    కొత్త సంవత్సరంలో తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరగాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. గతేడాది తెలంగాణలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాదైనా మంచి రోజులు వస్తాయా ? ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఓ వైపు సంవత్సరం మొదలైన కొద్ది రోజులకే రాజకీయంగా బీజేపీ దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటిలాగే అంతర్గత విభేదాలతో ఇబ్బందిపడుతోంది. తాజాగా టీపీసీసీ సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తాను రాజీనామా చేసిన ఇండిపెండెంట్‌గా సంగారెడ్డిలో పోటీ చేస్తానని.. అప్పుడు అక్కడ కాంగ్రెస్ బరిలో ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వస్తాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించనట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

    జగ్గారెడ్డిని కూల్ చేసేందుకు శ్రీధర్ బాబు సహా పలువురు సీనియర్ నేతలు రంగంలోకి దిగారని ప్రచారం జరిగింది. అయితే ఆ వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి.. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని.. సంక్రాంతి తరువాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలుస్తానని అన్నారు. అయితే పార్టీ ఏ ఒక్క వ్యక్తి ఇమేజ్ వల్లనో అధికారంలోకి రాదని.. పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు ఏ మాత్రం తగ్గలేదనే విషయం అర్థమవుతోంది. మరోవైపు జగ్గారెడ్డి వ్యాఖ్యలను బట్టి సీనియర్ నేతలంతా కలిసి రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని గట్టిగా డిసైడయ్యారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

    ఇదిలా ఉంటే కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండబోతోందనే అంశం జగ్గారెడ్డి ఎపిసోడ్ తేల్చిచెప్పిందని పలువురు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సఖ్యత కుదర్చడం అంత ఈజీ కాదు. కానీ ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి అలాంటి ప్రయత్నాలు చేస్తే.. ఇది పరిష్కారం కాని సమస్య ఏమీ కాదన్నది పలువురు అభిప్రాయం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నా.. కాంగ్రెస్ పెద్దలు మాత్రం పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీ శ్రేణులకు కూడా నిరాశ కలిగిస్తోంది. అయితే సొంత అజెండాతో ముందుకు సాగే నేతల విషయంలో ఏం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని మరికొందరు వాదిస్తున్నారు.

    Telangana: KCRకు బీజేపీ గట్టి షాక్.. ఈ రేంజ్ రియాక్షన్ ఊహించలేదా ?

    Telangana: జెట్ స్పీడ్‌గా బీజేపీ.. కన్నెత్తి చూడని కాంగ్రెస్.. తెలంగాణలో భిన్న పరిస్థితి


    తెలంగాణ కాంగ్రెస్‌లో అన్నీ తానై ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ సంస్కృతికి పూర్తి విరుద్ధమని.. అందరితో చర్చించిన తరువాతే కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తనదైన శైలిలోనే ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌లో తనకు మద్దతుగా ఉండే నేతలను మాత్రమే పట్టించుకుంటున్న రేవంత్ రెడ్డి.. మిగతా నేతల వ్యాఖ్యలను, తీరును అంతగా పరిగణనలోకి తీసుకోవడం లేదనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2022లో ఎలా ఉండబోతోందన్నది జగ్గారెడ్డి జగడంతో తేలిపోయిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Jagga Reddy, Telangana

    తదుపరి వార్తలు