తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి సీనియర్ నేత ?

జానారెడ్డి (ప్రతీకాత్మక చిత్రం )

JanaReddy: రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం.. బీజేపీ బలపడుతుండటంతో… బీజేపీలో చేరి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని జానారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 • Share this:
  గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ధీటుగా సీట్లు సాధించిన బీజేపీ.. తెలంగాణలో గులాబీ పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే సంకేతాలు పంపించింది. ఈ క్రమంలో ఆ పార్టీ వైపు చూసే నేతల సంఖ్య కూడా పెరిగిపోయింది. రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుండటంతో.. ఆ పార్టీ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జానారెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం వేరే రాష్ట్రంలో ఉన్న జానారెడ్డి.. ఈ అంశంపై బీజేపీ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారని సమాచారం.

  నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో.. ఆ స్థానంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అది జానారెడ్డి సొంత నియోజకవర్గం.2009, 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించిన జానారెడ్డి.. 2018లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. అయితే తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం.. బీజేపీ బలపడుతుండటంతో జానారెడ్డి బీజేపీలో చేరి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.

  గత కొంత కాలంగా రాజకీయంగా, పార్టీ కార్యకలాపాల పరంగా స్తబ్దుగా ఉన్న జానారెడ్డి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా తిరిగి యాక్టివ్ కావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంపై జానారెడ్డి బాగా పట్టుంది. ఇందుకు బీజేపీ దూకుడు కూడా తోడైతే.. ఆయన సీటు కూడా బీజేపీ ఖాతాలో పడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లోనే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపాలని బీజేపీ మొదట నిర్ణయించుకుందని వార్తలొచ్చాయి.

  అయితే బీజేపీ నేతల చర్చలతో జానారెడ్డి మనసు మార్చుకున్నట్లు సమాచారం. కుమారుడు రఘువీర్ కాకుండా తానే స్వయంగా రంగంలోకి దిగాలని జానారెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి జానారెడ్డి బీజేపీలోకి వెళితే.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోరు తీవ్రంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
  Published by:Kishore Akkaladevi
  First published: