రాజకీయాలు మనం అనుకున్నట్టుగా ఉండవు. మారుతున్న రాజకీయాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఎత్తులు, వ్యూహాలు వేస్తుండాలి. అయితే కొందరు నేతలకు మాత్రం అనుకోకుండా ఏర్పడే కొన్ని పరిణామాలు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా ఇలాంటి కష్టాలే వచ్చిపడ్డాయనే చర్చ ఆ పార్టీ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. మళ్లీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తనదైన వ్యూహంతో ముందుకు సాగేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పలు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపే విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి నేతలు వలస వచ్చేలా చేసి.. బీజేపీని దెబ్బకొట్టాలని భావించారు.
ఆ పార్టీలో చేరిన కొందరు నేతలు, ఆ పార్టీ వైపు చూస్తున్న నేతలను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి వ్యూహరచన చేశారు. కొందరు రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కాంగ్రెస్ వైపు వచ్చారు. మరికొందరు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలోనే వచ్చిపడ్డ హుజూరాబాద్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి ప్లాన్‌పై దెబ్బకొట్టిందనే చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సా లేక బీజేపీనా అనే అంశంపై ప్రజల్లో జోరుగా చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి కారణంగా ఈ విషయంలో బీజేపీని కాంగ్రెస్ ఓవర్ టేక్ చేసిందనే టాక్ వినిపించింది.
అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన ఘోర ఫలితాలతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి వచ్చినా.. కాంగ్రెస్ పరిస్థితిలో మార్పు లేదనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభావం కాంగ్రెస్‌పై ఉండదని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ చెబుతున్నప్పటికీ.. ఈ ఉప ఎన్నిక కారణంగా కాంగ్రెస్‌లోకి వలస వచ్చే నేతలు కచ్చితంగా డైలమాలో పడిపోయారనే టాక్ వినిపిస్తోంది.
త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం
టీఆర్ఎస్కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?
మరోవైపు హుజూరాబాద్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ మరింత దూకుడుగా ముందుకు వెళితే.. ఆ ప్రభావం కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి నాయకత్వం మీద పడుతుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో కేవలం కేసీఆర్ మీదే సీరియస్‌గా ఫైట్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. భవిష్యత్తులో కేసీఆర్‌తో పాటు బీజేపీ మీద కూడా అంతే గట్టిగ పోరాడాల్సి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి హుజూరాబాద్ ఫలితంతో కాస్త డీలాపడ్డ కాంగ్రెస్ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి మళ్లీ ఎలా ఉత్సాహం నింపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Revanth Reddy, Telangana