TELANGANA CONGRESS MLA KOMATIREDDY RAJAGOPAL REDDY MEETS CM KCR INVITES FOR HIS SON MARRIAGE AK
Telangana: కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఆ చర్చ జరిగిందా ?
తన కుమారుడి పెళ్లి పత్రికను సీఎం కేసీఆర్‌కు అందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్ అయిన ఎంపీ వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ టీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. ఆయన మనసంతా బీజేపీ వైపే ఉందనే చర్చ చాలాకాలంగా సాగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. త్వరలో జరగబోయే తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కారణంగా సీఎం కేసీఆర్‌ను కలవడం విశేషమేమీ కాకపోయినా.. రాజకీయవర్గాల్లో మాత్రం దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాను తట్టుకుని మునుగోడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హేమాహేమీలంతా ఓడిపోయిన సమయంలోనూ రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడం విశేషం.
అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ అయిన ఎంపీ వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ టీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. ఆయన మనసంతా బీజేపీ వైపే ఉందనే చర్చ చాలాకాలంగా సాగుతోంది. ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు గతంలోనే వచ్చాయి. అయితే ఎందుకో తెలియదు కానీ.. ఆయన ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్న రాజగోపాల్ రెడ్డి.. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత బీజేపీ వైపు మరింతగా అట్రాక్ట్ అవుతున్నారనే చర్చ జరుగుతోంది.
దీనికితోడు త్వరలోనే తమకు మరో ఆర్(పరోక్షంగా రాజగోపాల్ రెడ్డి) జత కలుస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో సొంత ఇమేజ్‌తో విజయం సాధించే సత్తా ఉన్న నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి.. ఆయనను బీజేపీలో చేర్చుకుని మళ్లీ మునుగోడులో పోటీ చేయించాలనే యోచనలో బీజేపీ ఉన్నట్టు ఊహాగానాలు వచ్చాయి.
వచ్చే జనవరి తరువాత దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగత కారణాల వల్ల కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ అంశాలపై ఏమైనా చర్చించారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణలో బలమైన నేతలను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్న బీజేపీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఫోకస్ చేసిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఇందుకు ప్రతివ్యూహం రచిస్తారా ? అన్నది ఈ సందర్భంగా చర్చకు వస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.