తెలంగాణలో కూటమి పేరుతో ప్రతిపక్షాలతో జట్టుకట్టి ఎన్నికల రంగంలోకి దూకిన కాంగ్రెస్ పార్టీ.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో పార్టీ శ్రేణులు డీలాపడిపోయాయి. ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇవ్వడంతో.. కూటమి నేతలంతా సైలెంటైపోయారు. ఓడిన నేతలు కూడా ఇన్నాళ్లూ ఏమీ మాట్లాడలేదు. అయితే, తాజా ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా స్వరం విప్పుతున్నారు. రాష్ట్ర నాయకత్వం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తీరు మార్చుకోకపోతే మనుగడ కష్టమని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్ ఉన్నవారంతా.. మెల్లమెల్లగా వాయిస్ పెంచుతున్నారు.
టీఆర్ఎస్ చేతిలో భారీ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు.. తమ కోపాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అదే చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గాలపై టీపీసీసీ జరిపిన సమీక్షా సమావేశంలో తన అసంతృప్తిని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో పాటు, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ కుంతియాలే కాంగ్రెస్ ఓటమికి కారణమని ఆరోపించారు. ఓటమికి కారణమైనవారే, సమీక్షలు నిర్వహిస్తారా అంటూ నిలదీశారు. గొడవ పెద్దదవడంతో నేతలు ఒకరిపై ఒకరు చేయిచేసుకునేంత వరకూ పరిస్థితి వెళ్లింది. దీంతో, సమీక్ష సమావేశంలో బూతుపురాణం వినిపించి, రాష్ట్ర నాయకత్వంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన సర్వే సత్యనారాయణపై వేటు వేసింది కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటి.
ఒకసారి ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచిన సర్వే.. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి, తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
సర్వే సత్యనారాయణ మాత్రమే కాదు, ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా కూడా ఓటమిపై పెదవి విప్పారు. కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలని సూచించారు. పాత పద్ధతిలోనే ముందుకు సాగితే లాభం ఉండబోదని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఘోరంగా విఫలమయ్యామని చెప్పారు. మారిన ఓటరు ఆలోచనాతీరుకు తగ్గట్టే పార్టీ తీరుకూడా మారాల్సిందేనని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజనర్సింహా.. రెండు దఫాలుగా ఓటమి చవిచూడాల్సి వస్తోంది.
నల్గొండ బ్రదర్స్‌లో ఒకరైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం ఇటీవలే.. కాంగ్రెస్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి కట్టడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని.. సమీక్షలో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం ముందు కుండబద్దలు కొట్టారు. నల్గొండ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఆయన.. ఈ ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కాస్త అసంతృప్తితోనే ఉన్నారు. ఎన్నికల ముందు కూటమి వద్దని ఎన్నిసార్లు చెప్పినా.. తన మాటలెవరూ పట్టించుకోలేదని టీపీసీసీ నాయకత్వంపై వెంకట్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. రాబోయే పార్లమెంట్‌లో ఒంటరిగా పోటీచేస్తేనే కొన్ని స్థానాలైనా గెలిచే అవకాశం ఉంటుందన్నారు.
తాజాగా, మాజీ మంత్రి డీకే అరుణ సైతం.. కాంగ్రెస్ ఓటమిపై పెదవి విప్పారు. కూటమి వల్ల ఓడిపోయామని అనుకోవడం లేదని, అయితే అన్ని జిల్లాల్లో కూటమి వర్కవుట్ కాలేదని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి లేకుంటేనే విజయావకాశాలు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ ఓటమికి టీఆర్ఎస్ గట్టి లక్ష్యంతో పనిచేసిందని చెప్పారు. అయితే కంచుకోట లాంటి పాలమూరు జిల్లాలోనూ కాంగ్రెస్ ఓటమి చెందడం అనుమానాలకు తావిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇలా నేతలంతా ఒక్కొక్కరుగా తమ అంతరంగాన్ని బయటపెడుతూ.. రాష్ట్ర నాయకత్వంపై తమ కోపాన్ని బయటపెడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కుంపటి మొదలైనట్టు తెలుస్తోంది. అందరూ సర్వే సత్యనారాయణలా బరస్ట్ అవుతారని చెప్పలేం, అలాగని అందరూ కోమటిరెడ్డి, రాజనర్సింహల మాదిరిగా సున్నితంగా విమర్శలు చేస్తారని చెప్పలేం. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈ సెగలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇది ఎటువైపు దారి తీస్తుందోనని.. లోలోపల తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మథనపడుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే సమీక్ష సమావేశాలకు కీలక నేతలు ముఖం చాటేస్తున్నారు. మరోవైపు, గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరు కారెక్కుతారో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది టీపీసీసీ. ఇలాంటి పరిస్థితుల్లో నేతల తిరుగుబాటు వైఖరితో కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఈ పరిస్థితి నుంచి టీపీసీసీ ఎలా బయటపడుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Praja Kutami, Telangana, Telangana Election 2018, Telangana News, Tpcc, Trs