కాంగ్రెస్‌లో ‘పీసీసీ’ రేసు... నేతలంతా ఢిల్లీలోనే...

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: December 16, 2019, 4:10 PM IST
కాంగ్రెస్‌లో ‘పీసీసీ’ రేసు... నేతలంతా ఢిల్లీలోనే...
తెలంగాణ కాంగ్రెస్ నేతలు
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్‌లో టీ పీసీసీ చీఫ్ మార్పు గురించి కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కొంతకాలం క్రితమే కాంగ్రెస్ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్‌లో పోటీ ఎక్కువగా ఉండటంతో... నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది హైకమాండ్. అయితే భారత్ బచావో కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్లిన నేతలు ఇదే అదనుగా లాబీయింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. . తమ అనుకూల నాయకుడికి పదవి కట్టబెట్టాలని కొందరు తంటాలు పడుతుంటే లేదు మావాడికే ఇవ్వాలని మరికొందరు అధిష్ఠానంలోని కీలక నాయకులకు చెప్పుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు

సోనియగాంధీ అపాయింట్‌మెంట్ కోసం పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్క మాత్రం భారత్ బచావో కంటే ముందే సోనియాను కలిశారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆమె సోనియా ముందు తన వాయిస్ వినిపించారని సమాచారం. కాంగ్రెస్ ముఖ్య నాయకులు పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎంపీలు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లాంటి నాయకులంతా అక్కడే ఉండడంతో పీసీసీ చీఫ్ మార్పుపై గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు.

తాను కూడా రేసులో ఉన్నానని హడావుడి చేసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండగా... త్వరలోనే ఆయన కూడా ఢిల్లీ వస్తారని తెలుస్తోంది. అధిష్టానం అవకాశమిస్తుందన్న ఆశతోనే నాయకులు అభిప్రాయ సేకరణ చేస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే సోనియగాంధీ మాత్రం పార్టీ నాయకత్వం పై మార్పు ఆలోచన చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పెండింగ్‌లో ఉన్న టీపీసీసీ చీఫ్ మార్పు అంశంపై కాంగ్రెస్ నాయకత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందా లేక మళ్లీ పెండింగ్‌లో పెడుతుందా అన్నది చూడాలి.First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు