TELANGANA CONGRESS LAUNCHES DIGITAL MEMBERSHIP DRIVE TPCC CHIEF REVANTH REDDY SLAMS CM KCR AND BJP OVER FARMERS ISSUE MKS
CM KCR మాటలు నిజం చేస్తారా? -జనవరి 26 తర్వాత మామూలుగా ఉండదు :revanth reddy
కాంగ్రెస్ శిక్షణా తరగతులు
నాయకులు ఎంతమంది వెళ్లిపోయినా కాంగ్రెస్ కు బలం కార్యకర్తలేనని, పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమని, కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుండెలకు హత్తుకుంటామని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో కీలక ప్రసంగం చేసిన ఆయన.. సీఎం కేసీఆర్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.
‘గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుంది. అందుకోసం కార్యకర్తలకు క్రమశిక్షణ అవసరం. కాంగ్రెస్ శ్రేణులు క్రమశిక్షణ తప్పి తాగుబోతు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు నిజం చేస్తారా? వద్దు అలా చేయొద్దు. కష్టపడే కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తా, కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత నేనే కఠిన చర్యలు తీసుకుంటా..’ అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శివారు కొంపల్లిలోని ఆస్పైసియాస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం కాంగ్రెస్ శిక్షణా తరగతులు, డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ శివారు కొంపల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. మండల, బ్లాక్, జిల్లా అధ్యక్షులకు రాజకీయ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. 119నియోజక వర్గాల నుంచి దాదాపు 1200మంది హాజరైయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం ఇచ్చారు.
ఎదిగిన నాయకులు ఎంతమంది వెళ్లిపోయినా కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలేనని, పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమని, కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుండెలకు హత్తుకుంటామని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. కార్యకర్తలకు మెరుగైన అవగాహన కల్పిస్తూ, వారి మనోభావాలు తెలుసుకునేందుకే శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ లో క్రమ శిక్షణ ముఖ్యమని, క్రమ శిక్షణ తప్పి తాగుబోతు సీఎం కేసీఆర్ మాటలను నిజం చేయొద్దని కార్యర్తలను ఉద్దేశించి రేవంత్ అన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని, ఆ రెండు పార్టీలూ తోడుదొంగలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే.. వరి వేస్తే ఉరి అని చెప్పడం సిగ్గులేనితనమని, రైతుల పక్షాన పోరాడుతోన్నది కాంగ్రెస్ మాత్రమేనని ఆయన అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో తెలంగాణ తల్లి బందీ అయిపోయిందని, కల్వకుంట్ల కుటుంబం బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనని రేవంత్ అన్నారు.
రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్
గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్న రేవంత్.. కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని, రాహుల్ గాంధీతో సన్మానాలు చేయిస్తామన్నారు. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికే కాంగ్రెస్ లో పదవులు, టికెట్లు ఇస్తామని, ఆ బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటానని కార్యకర్తలకు రేవంత్ భరోసా ఇచ్చారు. కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్టీ పటిష్టత, సిద్ధాంతాలు అనే అంశాలపై రేవంత్ తోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. డిజిటల్ మెంబర్ షిప్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, దీపక్ జాన్ శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజాచైతన్య పాదయాత్రపై ఏఐసీసీ కార్యక్రమాల ఇంచార్జి మహేశ్వర్ రెడ్డి, దళితులపై దాడులపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రసంగాలు చేస్తారు. సామాజిక న్యాయంపై మధుయాష్కీ,నైనాల గోవర్థన్ ప్రసంగం ఉంటుంది. సమకాలీన రాజకీయ అంశాలపై పలువురు సీనియర్ల ప్రసంగాలు ఉంటాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాల నిర్వహిస్తుండగా ఏఐసీసీ ఇంచార్జి మాణికం ఠాగూర్, బోసురాజు తదితరులు పాల్గొననున్నారు. మంగళ, బుధవారాల్లో కాంగ్రస్ శిక్షణా తరగతులు జరుగుతాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.