తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని చాలామంది భావించారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయనకు పోటీ చేసే ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరిగింది. ఏకంగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న బండ్ల గణేశ్... టీఆర్ఎస్ను టార్గెట్ చేసే విషయంలో కాస్త అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే గొంతు కోసుకుంటానంటూ కామెంట్ చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు.
టీఆర్ఎస్ గెలుపు తరువాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కోసమే అలాంటి వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చుకున్నారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన బండ్ల గణేశ్ జనసేనలో చేరి ఏపీలో రాజకీయాలు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా... ఆ తరువాత ఎమ్మెల్సీగా పోటీ చేసే ఛాన్స్ వస్తుందని భావించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని బండ్ల గణేశ్ ఆశించారు. ఇందుకోసం ఆయన బాగానే ప్రయత్నాలు చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తెలిసి కూడా బరిలోకి దిగేందుకు బండ్ల గణేశ్ సిద్ధమయ్యారని టాక్. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం బండ్ల గణేశ్‌కు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. పోటీ చేస్తామని ప్రకటించిన ఒక స్థానానికి గూడురు నారాయణరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో బండ్ల గణేశ్ నిరాశ చెందారని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో పోటీ చేయాలని భావించిన టాలీవుడ్ కమెడియన్ ఆశలు... ఇప్పుడప్పుడే నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Congress, Telangana, Trs