హోమ్ /వార్తలు /politics /

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ప్లాన్ మారిందా ?.. చివరి నిమిషంలో కొత్త ప్రతిపాదన

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ప్లాన్ మారిందా ?.. చివరి నిమిషంలో కొత్త ప్రతిపాదన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్, బీజేపీని ఫాలో కావాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశంలో మాణిక్యం ఠాగూర్‌ను కోరారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి ఎంపిక దగ్గరే ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థిని ఎంపిక చేసి ప్రచారంలో దూసుకుపోతుంటే.. ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం కాస్త నెమ్మదిగానే ముందుకు సాగుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో తొందరగా అవసరం లేదని భావిస్తుందో లేక నిజంగానే ఇందుకోసం సమయం పడుతుందో తెలియదు కానీ.. ఇంకా హుజూరాబాద్‌లో ఎవరు పోటీ చేయాలనే దానిపై ఆ పార్టీలో క్లారిటీ రావడం లేదు. దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో ముఖ్యనేతల సమావేశంలో చర్చించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై కూలంకషంగా చర్చించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న దామోదర రాజనర్సింహ.. దీనిపై మాణిక్యం ఠాగూర్‌కు వివరించారు.

నిజానికి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు ఊహాగానాలు వచ్చాయి. బీజేపీ, టీఆర్ఎస్‌లను ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ అభ్యర్థిగా బలమైన నాయకురాలు కొండా సురేఖ ఉండాలని రేవంత్ రెడ్డి భావించారని.. ఇందుకోసం ఆయన ఆమెను ఒప్పించారని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి అండ్ టీమ్ నచ్చజెప్పడంతో.. హుజూరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆమె అంగీకరించిందనే టాక్ కూడా వచ్చింది.

అయితే తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్ మరో రకంగా ఆలోచిస్తోందనే ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్, బీజేపీని ఫాలో కావాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశంలో మాణిక్యం ఠాగూర్‌ను కోరారు. ఈ రెండు పార్టీలు స్థానిక అభ్యర్థులనే ఎంపిక చేశాయని గుర్తు చేశారు. ఈటల రాజేందర్‌తో తలపడేందుకు టీఆర్ఎస్ కూడా స్థానికుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దించిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ కోసం స్థానికులు కాకుండా స్థానికేతరులను బరిలోకి దింపితే ఇబ్బందులు వస్తాయని ఠాగూర్‌కు కొందరు నేతలు సూచించారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధుకు చెక్ చెప్పేలా.. హుజూరాబాద్‌లో దళిత అభ్యర్థిని ఎంపిక చేయాలని కొందరు కోరారు. దీంతో ఆ దిశగా ఆలోచించాలని మాణిక్యం ఠాగూర్ నేతలకు సూచించారని సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్‌లో దళిత అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయిస్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణకు పోటీ చేసే అవకాశం దక్కనుంది.

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ.. గౌరవప్రదమైన విధంగా ఫలితాలు సాధించాలంటే కొండా సురేఖ వంటి వారే బరిలో ఉండాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి. ఈ విషయంలో అవసరమైతే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించాలని యోచిస్తున్నారు. మరి.. చివరి నిమిషంలో కాంగ్రెస్ ప్లాన్ మారుతుందా ? లేక రేవంత్ రెడ్డి అనుకున్నట్టే జరుగుతుందా ? అన్నది చూడాలి.

First published:

Tags: Congress, Huzurabad By-election 2021, Revanth Reddy, Telangana

ఉత్తమ కథలు