Congress vs BJP: హైదరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొట్లాట

బీజేపీ ఆఫీసు వద్ద రేవంత్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు (Screen Grab)

ఉత్తర్ ప్రదేశ్‌లో రాహుల్ గాంధీ అరెస్టు వివాదం హైదరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య చిచ్చు రాజేసింది. బీజేపీ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

  • Share this:
    Rahul Gandhi Arrest in Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో రాహుల్ గాంధీ అరెస్టు వివాదం హైదరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య చిచ్చు రాజేసింది. హత్రాస్‌లో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. రాహుల్ గాంధీతో యూపీలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో బీజేపీ కేడర్ కూడా వచ్చింది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో టెన్షన్ మరింత పెరిగింది. కాంగ్రెస్ నేత అనిల్ మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేశారనే వార్త పక్కనే ఉన్న గాంధీభవన్‌కు చేరింది. వెంటనే మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గాంధీభవన్ నుంచి బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. అదే సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

    ‘బీజేపీ నాయకులను ఒకటే అడుగుతున్నా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ నాయకులను ఒకటే అడుగుతున్నా. మీరు హిందూ సంప్రదాయాలను గౌరవించే వారయితే అర్ధరాత్రి పూట శవాన్ని ఎందుకు దహనం చేశారు. శవాన్ని దహనం చేయించిన పోలీసులను డిస్మిస్ చేయాలి. ఆ శవాన్ని కనీసం బాధితురాలి ఇంట్లో పది నిమిషాలు కూడా పెట్టనివ్వలేదు. కనీసం శవాన్ని కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టి దళితుల మీద బీజేపీ ప్రభుత్వం ఎంతగా దాడి చేస్తుందో తెలుస్తోంది. దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

    రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరడంతో బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    యూపీలోని హత్రాస్ జిల్లాలో ఓ దళిత యువతి అత్యాచారానికి గురైంది. కొందరు యువకులు ఆమె మీద సెప్టెంబర్ 14న అత్యాచారం చేశారని, దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే, వారిని యూపీ పోలీసులు అడ్డుకున్నారు. హత్రాస్‌లో 144 సెక్షన్ అమల్లో ఉందని, పాండమిక్ యాక్ట్ కూడా అమల్లో ఉందని, వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయితే, తాము నడిచి వెళ్తామనంటూ రాహుల్, ప్రియాంకా ఇద్దరూ నడక ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, యూపీ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పుడు జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ కింద పడిపోయారు. తనను కిందపడేసి లాఠీచార్జీ చేశారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ దేశంలో ప్రధాని మోదీ ఒక్కరికే నడిచే హక్కు ఉందా అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అనంతరం ఆయన్ను ఐపీసీ సెక్షన్ 188 కింద అరెస్టు చేశారు. రాహుల్ గాంధీతో యూపీ ప్రభుత్వం, యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: