కేసీఆర్ వర్సెస్ జగన్.. నీళ్ల లొల్లి మళ్లీ మొదలు..

ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, రాయలసీమ లిఫ్ట్​ స్కీమ్‌లను చేపట్టడంతోనే మళ్లీ నీళ్ల గొడవ మొదలైంది.

news18-telugu
Updated: May 19, 2020, 12:46 PM IST
కేసీఆర్ వర్సెస్ జగన్.. నీళ్ల లొల్లి మళ్లీ మొదలు..
కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్యమ సమయంలో తెలంగాణ నినాదం ఇది. ప్రజల నాడీ ఇది. గుండె చప్పుడు కూడా ఇదే. ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో తెలంగాణ ప్రజలు విజయం సాధించారు. స్వరాష్ట్రాన్ని సాధించుకొని అభివృద్ధి దిశగా సాగుతున్నారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ సాంకేతిక సమస్యలతో నీళ్ల లొల్లి మొదలైంది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఏపీలో కలుపుతూ తీసుకున్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన తెలంగాణ సీఎం కేసీఆర్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో కొన్ని సందర్భాల్లో నీళ్ల గొడవ తలెత్తింది. అయితే, ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అనుకున్నారు. కానీ.. ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, రాయలసీమ లిఫ్ట్​ స్కీమ్‌లను చేపట్టడంతోనే మళ్లీ నీళ్ల గొడవ మొదలైంది. జీవో నంబరు 203ను తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ సర్కారు.. ఏపీ తీరును తప్పుపడుతూ వచ్చింది. తాజాగా.. ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ పోతిరెడ్డి పాడు గురించి ఏం మాట్లాడకున్నా.. తనదైన శైలిలో మాట్లాడారు.

‘బేసిన్లు లేవు, భేషజాలు లేవు. ఇద్దరం నీళ్లు వాడుకుందాం. ఇరు రాష్ట్రాలకు సరిపోను 1000 టీఎంసీలు ఉన్నాయి. పిచ్చి కొట్లాటలు బంద్ చేయాలని ఆనాడు చెప్పాం. చంద్రబాబు ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్. బాబ్లీ మీద కొట్టాట పెట్టుకొని ఏమైనా సాధించాడా. ఒక్క టీఎంసీ ఐనా సాధించారా? కానీ మేం సాధించాం. 7 సార్లు వెళ్లి మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి పరిష్కరించాం. కాళేశ్వరం నుంచి 100 టీఎంసీలను సాధించి పంటలను పండించుకుంటున్నాం. ఇలా చేయాలని చెప్పాం. కాదు వేరే.. అంటే తేడాకొస్తుంది.’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గోదావరి మిగులు జలాలను ఎవరు తీసుకున్నా అభ్యంతరం లేదని.. చిల్లర పంచాయతీలతో ఏమీ సాధించమని చెప్పినట్లు గుర్తు చేశారు.

అయితే, ఈ రోజు ఏపీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల లొల్లి సృష్టించేలా ఉంది. గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌కు దిగువన, పోలవరం ప్రాజెక్టుకు ఎగువన తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలను తక్షణం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గోదావరి బోర్డు ఛైర్మన్‌ను ఆంధ్రప్రదేశ్‌ కోరింది. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందమూ లేకుండా, ట్రైబ్యునల్‌ ద్వారా కేటాయింపులు లేకుండానే తెలంగాణ ఈ కొత్త ప్రాజెక్టులు చేపడుతోందని ఫిర్యాదు చేసింది. దాంతో ఇప్పుడీ వ్యవహారం కేసీఆర్ వర్సెస్ జగన్ అన్నట్లు మారింది. రెండు రాష్ట్రాలు ఇప్పటి దాకా కలిసే ఉన్నాయని, కలిసే ఉంటామని కేసీఆర్ అన్న మరుసటి రోజే ఈ ఫిర్యాదు చేయడం చర్చకు దారితీసింది. అయితే, కొట్లాట అంటే కొట్లాటకు రెడీ అని కేసీఆర్ సవాల్ విసరడం, ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరంపై ఏపీ సర్కారు ఫిర్యాదు చేయడం నీళ్ల లొల్లికి దారి తీస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 19, 2020, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading