తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు. అయితే తెలంగాణ కేబినెట్లో కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ రకమైన పర్యటనలు చేపట్టింది లేదనే చెప్పాలి. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో అధికారులు, మంత్రులు పర్యటించడం మినహా.. సీఎం కేసీఆర్ స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాలు పెద్దగా లేవు.
అయితే తాజాగా మంత్రివర్గం సమావేశంలో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు సంబంధించి చర్చ జరగడం.. ఆకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నట్టుండి ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఇతర కారణాలు కూడా లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపై కొంతకాలంగా రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. కేంద్రం రాష్ట్రంలోని వరిని కొనుగోలు చేసే విషయంలో తాత్సారం చేస్తోందని ఆరోపించిన టీఆర్ఎస్.. కేంద్రం, బీజేపీని టార్గెట్ చేసింది. రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేస్తోంది తామేనని చెబుతోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు స్వయంగా రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా.. ఇప్పటికైతే తాము పూర్తి పంటను కొంటామని తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. యాసంగి విషయంలో మాత్రం రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించే అంశంపై దృష్టి పెట్టాలని సూచించింది. అయితే రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పదే పదే చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం.. వారికి మరింత దగ్గరయ్యేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులను కలుసుకుని వారికి భరోసా ఇవ్వనున్నారని తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.