తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. సంఖ్యాశాస్త్రం, వాస్తు వంటి అంశాలను ఎక్కువగా నమ్మే కేసీఆర్... ఏ ముఖ్యమైన కార్యక్రమం మొదలుపెట్టినా వీటిని పరిగణనలోకి తీసుకుంటుంటారు. తాను తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు. కేసీఆర్కు మొదటి నుంచి ఈ రకమైన సెంటిమెంట్లు ఎక్కువే. పూజలతో పాటు యాగాలపై కూడా టీఆర్ఎస్ అధినేతకు విశ్వాసం ఎక్కువ. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక యాగాలు నిర్వహించిన కేసీఆర్... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2015లో అయుత చండీయాగం నిర్వహించి మొత్తం దేశం దృష్టినే ఆకర్షించారు.
ఇక ఎన్నికలకు ముందు ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజ్యశ్యామల యాగం నిర్వహించారు గులాబీ బాస్. యాగం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేసీఆర్... అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఒంటిచేత్తో గెలిపించారు. గెలిచిన తరువాత తనతో రాజ్యశ్యామల యాగం చేయించిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను ఆయన ఆశ్రమంలో కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సమయంలోనే కేసీఆర్ స్వరూపానందేంద్రతో మరోసారి యాగం నిర్వహించే అంశంపై చర్చించారని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ మరోసారి యాగం చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జనవరి 21 నుంచి ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఈ యాగాన్ని నిర్వహించబోతున్నట్టు సమాచారం. దీనిపై ఆయన త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఏం యాగం చేయబోతున్నారనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. ఆయన ఈ సారి సహస్ర చండీయాగం, ప్రయూత చండీయాగం నిర్వహించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాజ్యశ్యామల యాగంతో అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న కేసీఆర్... మరోసారి యాగం చేసి జాతీయ రాజకీయాల్లోనూ విజయం సాధిస్తారేమో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:December 28, 2018, 14:07 IST