TELANGANA CM KCR TO IMPLEMENT KEJRIWALS FREE WATER SCHEME IN GHMC ELECTIONS BA
GHMC Elections: ఢిల్లీలో కేజ్రీవాల్ స్కీమ్ హైదరాబాద్‌లో అమలు చేయనున్న కేసీఆర్
కేజ్రీవాల్, కేసీఆర్
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అమలు చేస్తున్న పథకాన్ని తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్‌లో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అమలు చేస్తున్న పథకాన్ని తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్‌లో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భాగ్యనగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. జీహెచ్ఎంసీలో నెలకు 20వేల లీటర్ల లోపు నీటిని వినియోగించే వారు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. ‘జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల గృహ వినియోగ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీరందరూ తాగునీటి చార్జీలు భారంగా ఉన్నాయని భావిస్తున్నారు. డిసెంబర్ నెల నుంచి నెలకు 20వేల లీటర్ల లోపు నల్లా నీళ్లుల వినియోగించే గృహ వినియోగదారులు నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు. నెలకు 20 వేల లీటర్ల వరకు ప్రభుత్వం ఉచితంగానే నీటి సరఫరా చేస్తుంది. దీని ద్వారా నీటి దుబారా తగ్గుతుంది. ముఖ్యంగా పేద మధ్య తరగతి వారిపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ ప్రయోజనాన్ని జంట నగర ప్రజలు క్రమశిక్షణతో, నిబద్ధతతో వినియోగించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఉచిత నీటి పథకాన్ని హైదరాబాద్‌లో అమలు చేసిన తర్వాత మంచి చెడులను పరిశీలించి ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు.
ఇక హైదరాబాద్‌లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు మరో కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని కేసీఆర్ ప్రకటించారు. భవిష్యత్ తరాల కోసం ఆలోచించి రాబోయే 50 ఏళ్లకు సరిపడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వాయర్ల నిర్మాణం చేపడతామన్నారు. కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని, అతి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.
మరోవైపు గోదావరితో మూసీ నదిని అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మూసీనదిని సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసిందని చెప్పారు. మూసీకి ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.
మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యమైన అంశాలు
1. జీహెచ్ఎంసీ కోసం సమగ్రమైన చట్టం
2. నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా. ఎలాంటి బిల్లు ఉండదు
3. డిసెంబర్ నుంచి సెలూన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా
4. లాండ్రీలకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్
5. కరోనా కాలానికి సంబంధించి (మార్చి నుంచి డిసెంబర్ ) మోటారు వాహన పన్ను సుమారు రూ.267 కోట్లు రద్దు
6. పరిశ్రమలకు, వ్యాపారసంస్థలకు హెచ్డీ, ఎల్టీ కేటగిరీలకు కనీస డిమాండ్ చార్జీలు మినహాయింపు
7. రాష్ట్రంలో రూ.10కోట్ల లోపు బడ్జెట్‌తో తీసే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్
8. రాష్ట్రంలో అన్ని ధియేటర్లలో షోలు పెంచుకునేందుకు అనుమతి
9. హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చేందుకు కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణం త్వరలో నిర్మాణం ప్రారంభం
10. హైదరాబాద్‌లో డ్రైనేజీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ కోసం రూ.13,000 కోట్లు
11. వరద నీటి నిర్వహణకు రూ.12,000 కోట్లతో మాస్టర్ ప్లాన్
12. గోదావరితో మూసీ అనుసంధానం. బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు మూసీలో బోటింగ్. అందుకోసం రూ.5000 కోట్లు
13. మెట్రో రైలు రెండో దశలో రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు, బీహెచ్ఈఎల్ నుంచి మెహిదీపట్నం వరకు విస్తరణ.
14. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు ప్రాజెక్టు
15. మరో 90 కిలోమీటర్ల వరకు ఎంఎంటీఎస్ రైళ్ల విస్తరణ
16. SRDP రెండు, మూడో దశ పనులు ప్రారంభం. మొదటి దశలో ఈస్ట్, వెస్ట్ జోన్లలో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణం.. దీన్ని మిగిలిన ప్రాంతాలకు వర్తింపు
17. మెట్రో రైలు అందుబాటులో లేని ప్రాంతాల్లో బీఆర్టీఎస్ రోడ్లు నిర్మాణం
18. హైదరాబాద్ రింగ్ రోడ్డు అవతల మరో రీజనల్ రింగ్ రోడ్డు
19. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్ ట్రాక్‌ల నిర్మాణం
20. కాలుష్యాన్ని తగ్గించేందుకు దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంపు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు, పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు
21. చెత్తతో విద్యుత్ తయారీ. ప్రస్తుతం 23 మెగావాట్ల నుంచి 43 మెగావాట్లకు పెంపు
22. హైదరాబాద్ నాలుగు వైపులా టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటు
23. నగరంలో అభివృద్ధి వికేంద్రీకరణ
24. నగరవాసులకు 24 గంటల విద్యుత్ సరఫరా
25. ఆరేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కలిపి 17 లక్షల 80వేల ఉద్యోగాలు కల్పించాం.
26. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగింపు. వివాదాస్పద స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణ. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణ
27. స్థలాలు ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షల వరకు ఇవ్వాలని ప్రతిపాదన.
28. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్లో లైబ్రరీ, క్లబ్, యోగా, జిమ్ సెంటర్, ఉచితంగా బస్ పాస్‌లు.
29. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఈ - లైబ్రరీలు, ఇంటర్నెట్ సౌకర్యం