TELANGANA CM KCR TO IMPLEMENT HIS NEW PLAN TO TARGET BJP ONLY AFTER CABINET RESHUFFLE AK
Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్.. ఆ తరువాతే అమలు చేస్తారా ?
కేసీఆర్ (ఫైల్ ఫోటో)
KCR: వరి కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇచ్చేవరకు బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టబోమని.. వారిని వెంటాడతామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ సైలెంట్ అయినట్టు కనిపిస్తోంది.
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే వాళ్లే రాజకీయాల్లో రాణిస్తుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ కోవకే చెందుతారు. ఎలాంటి రాజకీయ పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకోవడం కేసీఆర్ తరువాతే ఎవరైనా. అయితే అలాంటి కేసీఆర్.. తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏ విధమైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతారన్నది ఆసక్తి రేపుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో.. ఆ పార్టీకి మరింత కొత్త ఉత్సాహం వచ్చినట్టయ్యింది. ఇదే జోష్‌తో టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు ముందుకు సాగుతోంది బీజేపీ.
అదే సమయంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు వరి కొనుగోళ్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. వరుసగా రెండు రోజుల పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ పార్టీని తనదైన శైలిలో టార్గెట్ చేశారు. ఆ తరువాత కేంద్రంతో తేల్చుకుంటానంటూ ఢిల్లీ వెళ్లారు. కానీ అక్కడ కేసీఆర్‌కు ప్రధాని సహా కీలక పెద్దల అపాయింట్‌మెంట్ లభించలేదనే ఊహాగానాలు మొదలయ్యాయి. పెద్దలెవరినీ కలవకుండానే మళ్లీ హైదరాబాద్ తిరిగొచ్చిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ బీజేపీని టార్గెట్ చేసే విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
వరి కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇచ్చేవరకు బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టబోమని.. వారిని వెంటాడతామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ సైలెంట్ అయినట్టు కనిపిస్తోంది. వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రం తమ వైఖరిని స్పష్టం చేయడంతో.. సీఎం కేసీఆర్ వారిపై పోరాటం చేస్తామని మరోసారి ప్రకటన చేసి రంగంలోకి దిగుతారా ? లేక మరో అంశాన్ని తెరపైకి తీసుకుని వస్తారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.
అయితే సీఎం కేసీఆర్ పార్టీలో మార్పులు చేర్పులపై దృష్టి పెట్టారని.. త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. కొత్తగా ఎవరికి చోటు ఇవ్వాలి ? ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరిని తప్పించాలి ? అనే అంశంపై ఆయన కసరత్తు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంలో క్లారిటీ వచ్చిన తరువాతే.. మళ్లీ బీజేపీపై రాజకీయ పోరాటాన్ని మొదలుపెట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.