Home /News /politics /

TELANGANA CM KCR TO ATTEND ELECTION CAMPAIGN MEETING IN NAGARJUNA SAGAR HAALIYA ON APRIL 14 AK

K Chandrashekar Rao: సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం కేసీఆర్.. మళ్లీ బహిరంగ సభ.. ఎప్పుడంటే..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

K Chandrashekar Rao: సాగర్‌లో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు నివేదికలు, సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్న గులాబీ బాస్.. పరిస్థితిని సమీక్షిస్తూ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలుస్తోంది.

    తెలంగాణలో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది టీఆర్ఎస్. దుబ్బాక తరహా పొరపాటు సాగర్‌లో జరగొద్దని.. పార్టీ నాయకులంతా సమష్టిగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నేతలకు సూచించారు. పార్టీలోని ముఖ్యనేతలంతా సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని.. దుబ్బాక తరహాలో ప్రచారానికి దూరంగా ఉండొద్దని తెలిపారు. తాను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. సాగర్‌ ఉప ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్.. సాగర్ నియోజకవర్గానికి తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశామనే విషయాన్ని గతంలోనే వివరించారు.

    అయితే ఉప ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్ సాగర్‌కు రానున్నారు. ఈ నెల 14న హాలియాలో జరగనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి ఒక రోజు ముందుగానే సీఎం కేసీఆర్ మరోసారి సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రాబోతుండటం విశేషం. సాగర్‌లో అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్.. చివరి నిమిషం వరకు వేచి చూసి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టికెట్ ఇచ్చారు.

    సాగర్‌లో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు నివేదికలు, సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్న గులాబీ బాస్.. పరిస్థితిని సమీక్షిస్తూ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలుస్తోంది. సాగర్‌లో మంచి మెజార్టీ సాధించడం ద్వారా బీజేపీ దూకుడుకు కళ్లెం వేయొచ్చనే భావనలో ఉన్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో దూకుడు మీదున్న బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా చెక్ చెప్పిన గులాబీ బాస్.. సాగర్ ఎన్నికల ద్వారా మరోసారి ఆ పార్టీపై పైచేయి సాధిస్తారేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Nagarjuna Sagar By-election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు