Telangana: సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. వాసాలమర్రికి ‘హుజూరాబాద్’ లింక్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: వాసాలమర్రిలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఈ విషయంలో ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు అర్థమవుతోంది.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా.. అందులో అనేక వ్యూహాలు దాగి ఉంటాయి. అందుకే ఆయన ఏం ఆలోచిస్తున్నారని.. ఎలాంటి ప్లాన్‌లు వేస్తున్నారనే అంశం ఎప్పుడూ ఓ హాట్ టాపికే. కొద్దిరోజులుగా కేసీఆర్ హుజూరాబాద్‌లో ప్రారంభించ తలపెట్టిన దళితబంధు పథకంపై తెలంగాణవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ పథకాన్ని కేవలం హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా.. మొత్తం తెలంగాణవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. టీఆర్ఎస్ మాత్రం ముందుగా దళితబంధును హుజూరాబాద్‌లోనే అమలు చేస్తామని.. ఆగస్టు 16న దీన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈలోపే నిన్న తన దత్తత గ్రామమైన యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఇక్కడి నుంచే దళితబంధు పథకం మొదలవుతుందని ప్రకటించారు.

    చెప్పినట్టుగానే వాసాలమర్రి గ్రామంలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఇచ్చే ఆర్థికసాయం అందుతోంది. అయితే సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నుంచి మొదలుపెట్టాలని భావించిన దళితబంధును ఇంత హఠాత్తుగా వాసాలమర్రి నుంచి ఎందుకు ప్రారంభించారనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 16లోపే హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని.. అందుకే ముందుగానే వాసాలమర్రి నుంచి ఈ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని ప్రచారం మొదలైంది.

    ఒకవేళ ఇప్పుడు హుజూరాబాద్ నోటిఫికేషన్ విడుదలైనా.. ఇప్పటికే మొదలైన పథకం కాబట్టి హుజూరాబాద్‌లో అమలు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని తెలంగాణ సీఎం భావిస్తున్నారని సమాచారం. అంతేకాదు.. ముందుగానే వాసాలమర్రి నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం ద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ఈ పథకాన్ని మొదలుపెట్టామనే విమర్శలకు కూడా చెక్ చెప్పినట్టు అవుతుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి వాసాలమర్రిలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్.. ఈ విషయంలో ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: