కేసీఆర్ కొత్త టార్గెట్...ఆ జిల్లా నేతల్లో టెన్షన్ ?

తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుండటంతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది.

news18-telugu
Updated: July 19, 2019, 1:13 PM IST
కేసీఆర్ కొత్త టార్గెట్...ఆ జిల్లా నేతల్లో టెన్షన్ ?
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్( ఫైల్ ఫోటో)
  • Share this:
లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మెల్లిమెల్లిగా మారుతోంది. తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుండటంతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది.మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ కంచుకోటలుగా ఉంటూ వస్తున్న ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మరోసారి తమ సత్తా చాటాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున చేరికలను ప్రొత్సహించి బలపడాలని భావిస్తున్న బీజేపీ... మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను ప్రజల్లోకి పంపించాలని యోచిస్తోంది.

ఇదే అంశం ఇప్పుడు టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది. బీజేపీ లోక్ సభ స్థానాలు సాధించిన జిల్లాల పరిధిలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా... తమ పార్టీ పట్టు ఏ మాత్రం సడల్లేదని నిరూపించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం స్థానాలను సొంతం చేసుకున్న టీఆర్ఎస్... మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించడం ద్వారా పట్టణ ప్రాంత ప్రజలు కూడా తమవైపు ఉన్నారనే సంకేతాలు ప్రజలకు పంపించాలని ప్రయత్నిస్తోంది.

ఇలా చేయడం ద్వారా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కేవలం గాలివాటం మాత్రమే అని నిరూపించాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఈ దిశగా కృషి చేయాలని కేసీఆర్ గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఇదే అంశంపై మాట్లాడిన కేసీఆర్... మున్సిపల్ ఎన్నికలను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని అన్నట్టు టీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది.

ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే నేతల పనితీరును అంచనా వేస్తామని ఆయన అన్నారని సమాచారం. దీంతో మంత్రివర్గ విస్తరణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కేసీఆర్ కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారని పలువురు చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల మంత్రులకు మున్సిపల్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>