TELANGANA CM KCR NEW PLAN TO TARGET ETELA RAJENDAR WITH PADI KAUSHIK REDDY AK
ఈటల రాజేందర్‌పై కేసీఆర్ సరికొత్త ప్లాన్ ?.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఈటల రాజేందర్, కేసీఆర్( ఫైల్ ఫోటో )
మొదటి నుంచి ఈ ఎన్నికలు సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా సాగడంతో.. ఫలితాల తరువాత సీఎం కేసీఆర్‌పై విజయం ఈటల రాజేందర్‌దే అనే ప్రచారం మొదలైంది.
తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎవరూ ఊహించని రిజల్ట్ ఇచ్చాయి. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్పై విజయం సాధించారు. రాజకీయవర్గాలు ఊహించిన దానికంటే మంచి మెజార్టీ సాధించాయి. మొదటి నుంచి ఈ ఎన్నికలు సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా సాగడంతో.. ఫలితాల తరువాత సీఎం కేసీఆర్‌పై విజయం ఈటల రాజేందర్‌దే అనే ప్రచారం మొదలైంది. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిన సీఎం కేసీఆర్.. స్వయంగా మంత్రి హరీశ్ రావును బరిలోకి దించి వ్యూహరచన చేసినా ఫలితం లేకుండాపోయింది. ఈటల రాజేందర్ గెలుపును టీఆర్ఎస్ ఏ రకంగానూ అడ్డుకోలేకపోయింది.
ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించడంతో.. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అనే ఎపిసోడ్‌కు దాదాపుగా ఫుల్ స్టాప్ పట్టినట్టే చాలామంది భావిస్తున్నారు. అయితే ఈటల రాజేందర్‌ను ఇప్పుడు ఓడించలేకపోయినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన పాడి కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలకు ముందు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు.
ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని భావించింది కేసీఆర్ సర్కార్. కానీ ఈ అంశాన్ని గవర్నర్ పెండింగ్‌లో పెట్టడంతో.. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని భావిస్తోంది. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడంతో పాటు ఏదైనా కీలక పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అలా చేయడం వల్ల హుజూరాబాద్‌లో ప్రజలకు దగ్గరయ్యేందుకు కౌశిక్ రెడ్డికి అవకాశం కలుగుతుందని గులాబీ బాస్ ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్‌పై ఫోకస్ చేసేలా చేయడం ద్వారా ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ పరిధిని దాటి మిగతా ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ చేయకుండా కట్టడి చేయొచ్చనే ఆలోచనలో టీఆర్ఎస్ అధినేత ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా కౌశిక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను బలంగా ఎదుర్కొవడంతో పాటు ఈటల రాజేందర్ మిగతా ప్రాంతాలపై దృష్టి పెట్టే అవకాశం కూడా తగ్గుతుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ ఆలోచన ఇదే అయితే.. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ ఎపిసోడ్లో ఎక్కువగా లాభపడేది కౌశిక్ రెడ్డి అని చెప్పకతప్పదు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.