ఈటలను కేసీఆర్ తప్పిస్తారా... అసలేం జరుగుతోంది ?

సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్

టీఆర్ఎస్‌లో మొదటి నుంచి కీలకంగా ఉన్న ఈటల రాజేందర్‌ పట్ల కేసీఆర్ నిజంగానే ఆ స్థాయిలో కోపంగా ఉన్నారా లేక ఆయనను కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచన వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ వార్తలు జోరందుకున్నాయి.

  • Share this:
    తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుందో తెలియదు కానీ... మంత్రివర్గ విస్తరణ కంటే ముందుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి ఈటల రాజేందర్‌ను కేబినెట్‌ నుంచి తొలగిస్తారనే ప్రచారం రెండు రోజుల నుంచి జోరందుకుంది. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన పలు అంశాలను ఈటల రాజేందర్ లీక్ చేశారని సీఎం కేసీఆర్ కోపంగా ఉన్నారని... ఈ కారణంగానే ఆయనను కేబినెట్ నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారని పలు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు, టీఆర్ఎస్ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

    టీఆర్ఎస్‌లో మొదటి నుంచి కీలకంగా ఉన్న ఈటల రాజేందర్‌ పట్ల కేసీఆర్ నిజంగానే ఆ స్థాయిలో కోపంగా ఉన్నారా లేక ఆయనను కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచన వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ వార్తలు జోరందుకున్నాయి. అయితే కేసీఆర్ ఈటల పట్ల అసంతృప్తితో ఉండటానికి అసలు కారణం లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన వినోద్ ఓడిపోవడమే అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వినోద్ గెలుపు విషయంలో ఈటల రాజేందర్ అంతగా శ్రద్ధ పెట్టలేదనే భావనలో కేసీఆర్ ఉన్నారని... అందుకే ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

    మరోవైపు ఈ మధ్య ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా వినోద్‌ను నియమించిన కేసీఆర్... త్వరలోనే ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను రూపొందించే బాధ్యతను ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల అనంతరం వినోద్‌ను కేబినెట్‌లోకి తీసుకుని పూర్తిస్థాయిలో ఆర్థికశాఖ బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్న సీఎం కేసీఆర్... ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను తప్పించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈటల రాజేందర్‌ విషయంలో జరుగుతున్న ప్రచారానికి టీఆర్ఎస్ నాయకత్వం చెక్ పెడుతుందా అన్నది చూడాలి.

    First published: