తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో.. టీఆర్ఎస్ రాజకీయలు మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. వారిలో ఒకరిద్దరి పేర్లు మారొచ్చని.. అంతకంటే ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక జనవరి నాలుగుతో పదవీకాలం ముగిసే 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలా వ్యవహరించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన వాళ్లందరికీ మరోసారి ఛాన్స్ ఇస్తారా ? లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా ? అన్నది సస్పెన్స్‌గా మారింది.
ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పురాణం సతీష్, వరంగల్ జిల్లాలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండలో జిల్లా తేర చిన్నపరెడ్డి, మెదక్ జిల్లాలో భూపాల్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత, ఖమ్మం జిల్లాలో బాలసాని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లాలో నారదాసు లక్ష్మణ్, భానుప్రసాద్ రావు, మహబూబ్‌నగర్ జిల్లాలో కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజుల పదవీకాలం ముగుస్తోంది. ఈ పన్నెండు మందిలో నలుగురు ఉపఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఉన్నారు. భూపతిరెడ్డిపై అనర్హత వేటు, కొండా మురళీ పార్టీ మారడంతో రెండు ఖాళీ కాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్, పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో అప్పట్లో నాలుగుచోట్ల ఉపఎన్నికలు జరిగాయి.
ఈ ప్లేస్‌ల నుంచి కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేర చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీలు అయ్యారు. రెండేళ్లు మాత్రమే ఈ నలుగురు పదవుల్లో ఉండటంతో వీరికి రెన్యువల్ దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. ఈ పన్నెండు మందిలో రెండుసార్లు ఎమ్మెల్సీలుగా చేసినవాళ్లు మరో నలుగురు ఉన్నారు. వారే బాలసాని, భాను ప్రసాదదరావు, భూపాల్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు. 12 మంది జాబితాలో మరికొందరికి కూడా సీటు నిరాకరించే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలతోపాటు రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న వారిని తప్పించాలని చూస్తున్నారట.
ఈ జాబితాలో ఉన్నవారిలో కొందరు ఎమ్మెల్సీ కాదు… ఎమ్మెల్యే సీటు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అలాంటి వారిలో పట్నం మహేందర్‌రెడ్డితోపాటు మరికొందరు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారికి ఎమ్మెల్యే సీటు ఇస్తామని హమీ ఇచ్చి.. ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పించాలని కేసీఆర్ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రకమైన హామీ ఇవ్వడం ద్వారా.. పదవి రాని వాళ్లు బీజేపీ వైపు చూసే అవకాశం ఉండదని గులాబీ బాస్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ రానివారిని బుజ్జగించేందుకు సీఎం కేసీఆర్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.