TELANGANA CM KCR MAY INCLUDE VENKATRAMI REDDY INTO CABINET AND SKIP MALLA REDDY AK
KCR సరికొత్త ఆలోచన.. త్వరలోనే కేబినెట్ విస్తరణ.. ఆ మంత్రికి షాక్ తప్పదా ?
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
Telangana: ఎవరూ ఊహించని సమయంలో ఊహించని విధంగా సీఎం కేసీఆర్ తన వ్యూహాలను, ఆలోచనలను అమలు చేస్తారనే విషయం అనేకసార్లు రుజువైంది. తాజాగా కేబినెట్ విస్తరణ విషయంలోనూ ఆయన ఇదే రకంగా వ్యవహరించబోతున్నారనే చర్చ టీఆర్ఎస్తో పాటు తెలంగాణ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయి ? వాటిని ఆయన ఎప్పుడు ఏ విధంగా అమలు చేస్తారని ఊహించడం చాలా కష్టం. ఎవరూ ఊహించని సమయంలో ఊహించని విధంగా సీఎం కేసీఆర్ తన వ్యూహాలను, ఆలోచనలను అమలు చేస్తారనే విషయం అనేకసార్లు రుజువైంది. తాజాగా కేబినెట్ విస్తరణ విషయంలోనూ ఆయన ఇదే రకంగా వ్యవహరించబోతున్నారనే చర్చ టీఆర్ఎస్తో పాటు తెలంగాణ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇద్దరు వ్యక్తులు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. వారిలో ఒకరు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కాగా.. మరొకరు సిద్ధిపేట జిల్లా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. ఆరు స్థానాలను భర్తీ చేసే క్రమంలో సీఎం కేసీఆర్ అనూహ్యంగా వీరికి ఛాన్స్ ఇచ్చారు. అసలు వీరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు కూడా ఊహించలేదు.
అయితే ఉన్నట్టుండి వీరికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టడం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఏమై ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తప్పించడంతో.. అదే సామాజికవర్గానికి చెందిన బండ ప్రకాశ్‌ను మంత్రిని చేయాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీసీ జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉండే ముదిరాజ్‌ల మద్దతు టీఆర్ఎస్కు కొనసాగేలా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఈ రకమైన ప్లాన్ చేశారనే వాదన వినిపిస్తోంది.
ఇక సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్సీ చేయడం వెనుక కూడా సీఎం కేసీఆర్ మరో రకమైన ఆలోచన చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వెంకట్రామిరెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకోసం ఆయన మరో మంత్రిని పదవి నుంచి తప్పించాల్సి ఉంటుంది. ఆ మంత్రి ఎవరనే చర్చ సాగుతున్న నేపథ్యంలో.. నగరానికి చెందిన ఓ మంత్రిని ఇందుకోసం తప్పిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ మంత్రి సామాజికవర్గం, వెంకట్రామిరెడ్డి సామాజికవర్గం ఒకటే కాబట్టి పెద్దగా ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చనే పలువురు టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
వెంకట్రామిరెడ్డిని కేబినెట్లోకి తీసుకుని ఆయనకు తన దగ్గర ఉన్న కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగిస్తారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. రెవెన్యూశాఖకు సంబంధించిన అంశాలకు సంబంధించి వెంకట్రామిరెడ్డికి మంచి అవగాహన ఉందని.. అందుకే ఆయనకు ఈ శాఖ అప్పగించాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి ఇంతకాలం కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడంతో.. ఆయనను మంత్రి పదవి కూడా వరిస్తుందా అనే చర్చ జోరందుకుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.