త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ?... హరీశ్‌రావుకు ఛాన్స్ దక్కేనా ?

Telangana Cabinet Expansion | లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో కేబినెట్ విస్తరణ చేపట్టాలని భావించిన కేసీఆర్... ఇందుకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: May 6, 2019, 2:42 PM IST
త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ?... హరీశ్‌రావుకు ఛాన్స్ దక్కేనా ?
కేసీఆర్, హరీష్ రావు (File)
  • Share this:
డిసెంబర్‌లో రెండోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... మంత్రివర్గ ఏర్పాటు కోసం రెండు నెలలకు పైగా సమయం తీసుకున్న విషయం తెలిసిందే. తనతో పాటు మహమూద్ అలీతో కలిసి ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... మంత్రివర్గ విస్తరణ అంశంపై దాదాపు రెండు నెలల సమయం తీసుకున్నారు. ఫిబ్రవరి మూడోవారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కేసీఆర్... కొత్తగా 10 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. తనతో కలిసి మొత్తంగా 18 మందితో కేబినెట్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా... కేసీఆర్ మాత్రం కేబినెట్‌లో ఖాళీలను అలాగే ఉంచారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో కేబినెట్ విస్తరణ చేపట్టాలని భావించిన కేసీఆర్... ఇందుకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవమైన జూన్ 2 నాటికి తెలంగాణలో పూర్తిస్థాయి కేబినెట్‌ కొలువుదీరేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు రానుండటంతో... అందుకు తగ్గట్టుగానే మంత్రుల పనితీరు, ఎమ్మెల్యే పనితీరును బేరీజు వేసుకుని కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టి... పూర్తిస్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలని కేసీఆర్ డిసైడయ్యారని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో జూన్ 2 నాటికి కేబినెట్ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో... పార్టీ సీనియర్ నేత హరీశ్ రావుకు కేబినెట్‌లో చోటు దక్కుతుందా లేదా అనే అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది.

తొలి విడత విస్తరణ సందర్భంగా మంత్రివర్గం నుంచి కేటీఆర్, హరీశ్ రావులను దూరం పెట్టిన కేసీఆర్... ఈ సారి వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా హరీశ్ రావుకు కేబినెట్‌లో చోటు దక్కుతుందా లేదా అన్నది రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ సారి కేబినెట్‌లో చోటు దక్కకపోతే... ఐదేళ్ల పాటు హరీశ్ రావు సాధారణ ఎమ్మెల్యేగానే ఉండాల్సి ఉంటుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి అనూహ్య నిర్ణయాలు తీసుకునే కేసీఆర్... లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వారంలోనే మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరిస్తారా ? లేక ఇందుకోసం మరింత సమయం తీసుకుంటారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.First published: May 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు