ఆ ఇద్దరు మంత్రులపై సీఎం కేసీఆర్ వేటు..?

సీఎం కేసీఆర్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించారా? గత కేబినెట్ విస్తరణ సందర్భంగా పాతవారెవ్వరినీ టచ్ చేయని సీఎం.. ఇప్పుడు కొందరికి ఉద్వాసన పలకనున్నారా? అంటే.. రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి.

news18-telugu
Updated: November 12, 2019, 4:32 PM IST
ఆ ఇద్దరు మంత్రులపై సీఎం కేసీఆర్ వేటు..?
సీఎం కేసీఆర్ (ఫైల్)
  • Share this:
సీఎం కేసీఆర్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించారా? గత కేబినెట్ విస్తరణ సందర్భంగా పాతవారెవ్వరినీ టచ్ చేయని సీఎం.. ఇప్పుడు కొందరికి ఉద్వాసన పలకనున్నారా? అంటే.. రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. మునిసిపల్ ఎన్నికలు సమీపంలో ఉన్న తరుణంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై జోరుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలున్నాయని, దానిలో భాగంగా కొందరికి సీఎం ఉద్వాసన పలకనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు మంత్రులపై సీఎం కేసీఆర్ వేటు వేస్తారని జోరుగా చర్చ సాగుతోంది. ఆ ఇద్దర్ని పక్కనపెట్టి, కొత్తగా మరో ఇద్దర్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. నిజామాబాద్, నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీలో వార్తలు ఊపందుకున్నాయి. వాస్తవానికి కేబినెట్ విస్తరణ సందర్భంగా అప్పటి వరకు ఉన్న ఏ మంత్రిని కూడా తొలగించలేదు. అయితే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రితో పాటు గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మంత్రిపై వేటు వేస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి.. కేబినెట్ విస్తరణ సందర్భంగానే ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన ఆ మంత్రికి చెక్ పెడతారని భావించారని, ఇప్పుడు సీఎం నిర్ణయం తీసుకోబోతున్నారని చెబుతున్నారు.

ఇక.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో సక్సెస్ అయిన పళ్లా రాజేశ్వర్ రెడ్డికి నల్లగొండ కోటా కింద మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ గురించి వార్తలు రావడంతో పలువురు మంత్రుల్లో టెన్షన్ మొదలైందని, తమ పదవి ఉంటుందో.. ఊడుతుందో.. అని ఆందోళన చెందుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.

కానీ.. మునిసిపల్ ఎన్నికలు ఉన్న తరుణంలో వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోరని, ఇప్పటికిప్పుడు ఏ మంత్రినీ మంత్రివర్గం నుంచి తొలగించే సాహసం చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, సంచలన నిర్ణయాలు తీసుకునే సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరికీ తెలీదు. ఎన్నికలు ఉన్నా.. సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 12, 2019, 4:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading