టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు శరవేగంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు తరువాత.. కేసీఆర్ గేమ్ ప్లాన్ మారిందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడకుండా ఉండేందుకు వ్యూహాలు రచిస్తున్న కేసీఆర్.. ఈ క్రమంలోనే తమ పార్టీలో ఉన్న కొందరు నేతలు బీజేపీ వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్‌తో కొనసాగుతూ అసంతృప్తితో ఉన్న ఉద్యమ నేతలను గుర్తించే పనిలో ఉన్నారని.. వారిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారని చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఉద్యోగుల సంఘం మాజీ నాయకుడు విఠల్ బీజేపీలో చేరారని సమాచారం.
అయితే బీజేపీ టీఆర్ఎస్ విషయంలో ఈ రకమైన ఆలోచన చేస్తోందని గమనించిన గులాబీ బాస్.. ఉద్యమంలో పని చేసి ఇంకా పదవులు దక్కని నేతలపై ఫోకస్ చేశారని.. త్వరలోనే వారికి నామినేటెడ్ పదవులు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన వెంటనే సీఎం కేసీఆర్ ఈ దిశగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
తెలంగాణ ఉద్యమం సమయం నుంచి టీఆర్ఎస్‌లో ఉన్న నేతలు, ఉద్యమ సమయంలో పని చేసి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న నేతలను గుర్తించి.. పార్టీ ప్రాధాన్యత క్రమంలో వారికి పదవులు అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగానే మన్నె కృషాంక్‌ను తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ’ చైర్మన్‌గా, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా, వేద సాయిచందర్(సింగర్ సాయిచంద్)ను తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించారు.
తాజాగా తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
CM kcr meeting :నేడు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం... పలు కీలక అంశాలపై చర్చ..
బీజేపీ నేతలు టీఆర్ఎస్‌లోని ఉద్యమ నేతలపై కన్నేయడంతో సీఎం కేసీఆర్ ముందుగానే అలర్ట్ అయ్యారని.. అందులో భాగంగానే వీరికి పదవులు కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. మరికొందరు నేతలు కూడా పదవులు దక్కే వారి జాబితాలో ఉన్నారని.. త్వరలోనే వారిని కూడా నామినేటేడ్ పదవులు కోసం ఎంపిక చేసే దిశగా కేసీఆర్ యోచిస్తున్నారని సమాచారం. మొత్తానికి బీజేపీ వ్యూహానికి సీఎం కేసీఆర్ ఆదిలోనే చెక్ చెబుతున్నట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.