మళ్లీ అంచనాలకు అందని కేసీఆర్.. త్వరలోనే అందుకు రెడీ!

KCR Federal Front Tours : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో.. ఇప్పటినుంచే ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 24, 2019, 7:32 AM IST
మళ్లీ అంచనాలకు అందని కేసీఆర్.. త్వరలోనే అందుకు రెడీ!
తెలంగాణ సీఎం కేసీఆర్
news18-telugu
Updated: April 24, 2019, 7:32 AM IST
రాజకీయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు, ఎత్తులు అంచనాలకు అందవని చెబుతారు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రత్యర్థుల అంచనాకు అందని దాఖలాలు చాలానే ఉన్నాయి. గతేడాది ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆయన చేసిన ప్రకటన కూడా అలాంటిదే. అప్పటిదాకా రాష్ట్రానికే పరిమితమైన కేసీఆర్.. ఢిల్లీ రాజకీయాలను గురిపెట్టడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది అయ్యే పని కాదని ప్రత్యర్థులు ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. కేసీఆర్ కూడా కొన్నాళ్లుగా 'ఫెడరల్ ఫ్రంట్' టూర్స్ పక్కనపెట్టడంతో.. ఇక దాని కథ ముగిసినట్టేనా అన్న చర్చ కూడా జరిగింది. అయితే ఎన్నికల తర్వాత ఆయన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెడుతారన్న వాదన వినిపించింది. కానీ కేసీఆర్ మళ్లీ ఎవరి అంచనాలకు అందని రీతిలో ఎన్నికలు ఇంకా పూర్తికాక ముందే ఫెడరల్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.

త్వరలోనే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కావాల్సి ఉందంటున్నారు. పర్యటనలో భాగంగా వివిధ పార్టీల అధినేతలను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని బలంగా నమ్ముతున్న కేసీఆర్.. బలమైన ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో.. ఇప్పటినుంచే ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసేనాటికి ఫెడరల్ ఫ్రంట్‌కు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించడం.. ఉమ్మడి ఎజెండాతో ఆయా పార్టీలను కలుపుకోవడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ టూర్స్ ఉండబోతున్నాయని సమాచారం.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...