ముస్లిం విద్యార్థినులు స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించరాదన్న కర్ణాటక సర్కారు నిబందనలపై నిరసనోద్యమం తీవ్రతరమైంది. హిజాబ్ వివాదంలో కోర్టులు సైతం వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తుండటంతో రాజకీయం రోజుకో ములుపు తిరుగుతోంది. కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మకం కావడం వెనుక పాకిస్తాన్, ఖలిస్తాన్ ప్రేరిత శక్తుల ప్రమేయం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే హిజాబ్ వివాదం బీజేపీ మతోన్మాదం వల్లే తలెత్తిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం హిజాబ్ వివాదంలో బీజేపీనే తప్పుపడుతున్నారు. బీజేపీ పాలనలో దేశ భవిష్యత్తుపై కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు..
యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా శనివారం రాయగిరిలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పలు జాతీయ అంశాలను లేవనెత్తారు. రాహుల్ గాంధీ పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను బర్తరఫ్ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అటుపై ప్రస్తుతం దేశమంతటా రగులుతోన్న హిజాబ్ వివాదంపైనా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం విద్యార్థినుల పట్ల అంత రాక్షసంగా వ్యవహరించొచ్చా? అని బీజేపీని ఆక్షేపించారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనతో దేశం సర్వనాశనం అయిందని, భారత ఐటీ రంగానికి రాజధానిగా, సిలికాల్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి పొందిన బెంగళూరు ప్రతిష్ట సైతం మసకబారే దుస్థితి ఏర్పడిందని కేసీఆర్ అన్నారు.
‘శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఈ దేశం ఎవడి అయ్య సొత్తు కాదు. దేశాన్ని నాశనం చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు. కర్ణాటకలో విద్యార్థులపై రాక్షసంగా ప్రవర్తించవచ్చా? సాఫ్ట్‌వేర్ రంగానికి ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది. సిలికాన్ వ్యాలీని కశ్మీర్ వ్యాలీగా మారిస్తే పెట్టుబడులు ఎవరు పెడతారు?దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా? పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోతున్నాయి. దేశంలో 15.. 16లక్షల పరిశ్రమలు మూతపడిన విషయం వాస్తవం కాదా?
140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో మత విద్వేషంతో ఎవరి కడుపు నిండుతుంది. మత పిచ్చి అవసరమా? మోదీ.. ఏరంగానికి మేలు చేశారు. మోదీ పాలనలో ఇప్పటికే దేశం నష్టపోయింది. రాజకీయంగా స్పందించకపోతే దేశం నాశనమైతుంది. చాలా బాధతో ఈ మాట చెబుతున్నా. అమెరికాలాంటి దేశాల్లో మత పిచ్చి ఉండదు.. అందుకే అభివృద్ధి చెందింది. కరోనా సమయంలో మోదీ తెలివితక్కువ లాక్‌డౌన్ నిర్ణయం వల్ల కోట్లాది మంది ఇబ్బందులు పడ్డారు. కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా నాకు అందింది. నిన్నే మమతా బెనర్జీ , మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే మాట్లాడారు. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలి..’అని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.