TELANGANA CM K CHANDRASEKHAR TO LAY FOUNDATION FOR VARIOUS LIFT IRRIGATION PROJECTS IN NALGONDA DISTRICT IN IN VIEW OF NAGARJUNA SAGAR BYPOLLS BA
Nagarjuna Sagar ByPolls: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల టార్గెట్.. రంగంలోకి కేసీఆర్.. 10న ముహూర్తం
సీఎం కేసీఆర్ (ఫైల్ పోటో)
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరిత గతిన నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు టార్గెట్‌గా అడుగులు వేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు ఓడిపోవడం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోరంగా సీట్లు పడిపోవడంతో ఈ సారి నాగార్జున సాగర్‌పై దృష్టి పెట్టారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరిత గతిన నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై చర్చ జరిగింది. వివిధ ప్రాజెక్టుల కింద కవర్ కాగా, మిగిలిన ఆయకట్టుకు సాగు నీరు అందించడానికి అనువుగా రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతో పాటు 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ నెల 10న మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తిపోతల పథకాలకు శంఖుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాజీమంత్రి జానారెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇక టీఆర్ఎస్ తరపున ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ చనిపోయిన నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు సీటు ఇస్తారా ? లేక మరొకరిని తెరపైకి తీసుకొస్తారా ? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇక తెలంగాణలో మంచి ఊపు మీదున్న బీజేపీ ఇక్కడ ఎవరిని బరిలోకి దింపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన నివేదితా రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు బీజేపీ తరపున బరిలోకి దిగేందుకు సై అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం నాగార్జునసాగర్ అభ్యర్థి విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ నాయకురాలైన విజయశాంతి పేరును బీజేపీ పరిశీలిస్తోందని సమాచారం. కొద్ది నెలల క్రితమే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన విజయశాంతి సేవలను వాడుకోవాలని భావిస్తున్న బీజేపీ.. ఆమెను నాగార్జునసాగర్ బరిలోకి దింపాలని యోచిస్తోందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరికీ తెలిసిన అభ్యర్థి బరిలో ఉంటేనే తమకు మంచి ఫలితాలు వస్తాయని.. కాంగ్రెస్, టీఆర్ఎస్లకు గట్టి పోటీ ఇచ్చినవాళ్లమవుతామని బీజేపీ భావిస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.