తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆయన గులాబీ కండువా కప్పుకోవడం దాదాపు లాంఛనమే అని చెప్పాలి. ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరతారనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరితే ఆయనకు ఎలాంటి పదవి వస్తుందనే అంశంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికీ అంతుచిక్కని వ్యూహాలను అమలు చేయడంలో దిట్టగా పేరున్న సీఎం కేసీఆర్.. ఎల్.రమణను పార్టీలో చేర్చుకోవడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. కమలదళం తరపున తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడ ఆయనను ఎదుర్కొనేందుకు బలమైన నేత కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. ఈటల బీసీ నాయకుడు కావడంతో మరో బీసీ నాయకుడిని బరిలోకి దింపితేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఉన్న కేసీఆర్.. ఇందుకోసం ఎల్.రమణను టీఆర్ఎస్లో చేర్చుకుని పోటీలో నిలిపితే బాగుంటుందనే యోచన చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రిగా, కరీంనగర్ ఎంపీగా పని చేసిన ఎల్.రమణకు హుజూరాబాద్ నియోజకవర్గంతో మంచి సంబంధాలే ఉన్నాయి.
ఈ కారణంగానే ఆయన హుజూరాబాద్‌లో పోటీ కోసం ఎల్.రమణను ఎంపిక చేసుకున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎల్.రమణను పార్టీలో తీసుకున్న తరువాత ఆయనను హుజూరాబాద్ నుంచి బరిలో దింపడం.. అలా కుదరకపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అంశంపై సీఎం కేసీఆర్ ఆయనకు హామీ ఇవ్వొచ్చని తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమైన టీటీడీపీ అధ్యక్షుడు రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.