Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి.. గవర్నర్‌కు తెలంగాణ కేబినెట్ సిఫారసు

కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ టికెట్ ఆశించిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరి ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.

  • Share this:
    ఇటీవలే టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయనకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డిని పేరును ఖరారు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణలో ఒకే ఒక్క నామినేటెడ్ పదవి ఖాళీగా ఉంది. ఆ పదవిని కౌశిక్ రెడ్డికి ఇస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడిన కౌశిక్ రెడ్డి.. జులై 21న టీఆర్ఎస్‌లో చేరారు. అంతకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. ఐతే తనకే టీఆర్ఎస్‌ టికెట్ వస్తుందని కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో టేపు వైరల్ కావడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్. ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు కౌశిక్ రెడ్డి.

    హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గంపై సీఎం కసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ అక్కడి నుంచే ప్రారంభించారు. దళిత బంధు పథకాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. గొర్రెల పంపిణీ ప్రక్రియను కూడా ఇక్కడే ప్రారంభించారు. వీటికి తోడు పలు సామాజిక వర్గాల వారీగా కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నారు. హుజూరాబాద్ పట్టణ అభివృద్ధికి ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేవారు. ఇక ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా హుజూరాబాద్‌కే చెందిన బండ శ్రీనివాస్‌ను నియమించారు. ఓటర్లు ఈటల వైపుకు మళ్లకుండా తమ వైపు ఆకర్షించేందుకు రకరకాల స్కీమ్‌ను అమలు చేస్తున్నారు


    ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ టెన్షన్ పట్టుకుందని.. ఓడిపోతామన్న భయంతోనే అక్కడ వేల కోట్ల కుమ్మరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం తన పని తాను చేసుకుంటూపోతోంది. తాజాగా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ టికెట్ ఆశించిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరి ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లోనే ఉంటున్నారు. పాదయాత్రగా ప్రతి గ్రామాన్ని పర్యటిస్తున్నారు. ఐతే నిన్న ఆయన అస్వస్థతకు గురవడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈటల రాజేందర్ భార్య జమున కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: