TELANGANA BUDGET 2022 TRS KTR WARM WISH TO ETELA RAJENDER WHILE KISHAN REDDY SLAMS CM KCR OVER BJP MLAS SUSPENSION MKS
CM KCRకు భిన్నంగా మంత్రి KTR -విరోధులతోనూ ఆత్మీయ ఆలింగనం -ఈటల ముఖం చూడొద్దనే సస్పెన్షన్?
కేటీఆర్, ఈటల
తండ్రి కేసీఆర్ తీరుకు పూర్తి భిన్నంగా మంత్రి కేటీఆర్ రాజకీయ విరోధుల్ని సైతం ఆత్మీయంగా పలకరించి ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఈ మేరకు ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై గులాబీ బాస్ యుద్దం ప్రకటించనంత వరకూ తెలంగాణలో ‘సీఎం కేసీఆర్ (Telangana CM KCR) వర్సెస్ ఈటల రాజేందర్’అన్నట్టుగా రాజకీయం సాగిన సంగతి తెలిసిందే. ‘కేసీఆర్ పగపడితే అంతు చూసేదాకా వదలడు’అని ఈటల స్వయంగా వ్యాఖ్యానించడం విదితమే. అయితే, తండ్రి కేసీఆర్ తీరుకు పూర్తి భిన్నంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) రాజకీయ విరోధుల్ని సైతం ఆత్మీయంగా పలకరించి ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ బడ్జెట్ (Telangana Budget 2020) సమావేశాల తొలిరోజైన సోమవారం అసెంబ్లీలో ఈ మేరకు ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఈటల రాజేందర్ (Etela Rajender) ముఖం చూడటం ఇష్టం లేకే కేసీఆర్ సస్పెండ్ చేయించారనే ఆరోపణలూ వచ్చాయి. వివరాలివి..
కేసీఆర్ సర్కారు ఈఏడాది సైతం రూ.2.56కోట్ల విలువైన బాహుబలి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సోమవారం నాడు బడ్జెట్ ప్రకటనకు ముందు శాసనసభలో ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యరీతిలో మంత్రి పదవి కోల్పోయి, టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై, బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్ లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటైన మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు.
మంత్రి కేటీఆర్ సభలోకి వచ్చాక.. అప్పటికే ఆసీనులైన విపక్ష సభ్యుల స్థానాల వద్దకు వెళ్లారు. అక్కడ ఈటల రాజేందర్ కనపడగానే.. ‘అన్నా.. బాగున్నావా..’అంటూ కేటీఆర్ ఆప్యాయంగా పలకరించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్ ను కూడా మంత్రి పలకరించారు. అనంతరం కాంగ్రెస్, ఐఎంఐఎం ఎమ్మెల్యేలకూ పలకరించిన మంత్రి కేటీఆర్.. చివర్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకూ అభివాదం చేశారు. ఒకప్పుడు టీఆర్ఎస్ లో నంబర్ 2గా కొనసాగిన ఈటల అనూహ్య రాజకీయ పరిణామాలతో విపక్ష సభ్యుడిగా సభకు రావడం, ఆయనను కేటీఆర్ ఆత్మీయంగా పలకరించడం చర్చనీయాంశమైంది. అయితే, ఈ దృశ్యం తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది..
గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం, బడ్జెట్ ప్రసంగంలో కేంద్రంపై విమర్శలు గుప్పించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. ఒక దశలో పోడియంలోకి చొచ్చుకురావడంతో ఆ ముగ్గురిపై స్పీకర్ ఫైరయ్యారు. ప్రభుత్వ సూచన మేరకు ఈటల, మరో ఇద్దరిపై బడ్జెట్ సెషన్ మొత్తానికీ సస్పెన్షన్ విధిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే, ఈటల రాజేందర్ ముఖం చూడటం ఇష్టంలేకే సీఎం కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడవడం లేదని, బడ్జెట్ ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వం వీడ్కోలు ప్రసంగంలా ఉందని, 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఏ రాష్ట్రం కూడా గవర్నర్‌ను ఇలా అవమానించలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలేంటని ప్రశ్నించినందుకు బీజేపీ ఎమ్మెల్యేలను స్పెండ్ చేయడం సబబేనా? మరి పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేసినప్పుడు కేంద్రం స్పెండ్ చేయలేదే! ప్రశ్నించే గొంతు నొక్కేందుకే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని కిషన్ రెడ్డి వాపోయారు. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో చూడకూడదంటూ కేసీఆర్ గతంలో చేసిన ప్రతిజ్ఞను నిలుపుకునేందుకే ఈ పని చేశారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈటలను చూడాల్సి వస్తుందనే సభ ప్రారంభమైన 10 నిమిషాలకే సస్పెండ్ చేశారని, ప్రగతిభవన్‌లో రాసిన సస్పెండ్ తీర్మానం ప్రకారమే ఇదంతా జరిగిందన్నారు కేంద్ర మంత్రి. బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ఎత్తేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.