తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలను దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.తమ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దాడిని చూస్తే బీజేపీ నేతలను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోందన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కుడి భుజం వినోద్ కుమార్‌ను ఓడించామని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని.. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఎన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల సొంతింటి కలను నిజం చేయడంలో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, నియంత పోకడలను త్వరలోనే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు వివరిస్తామని అన్నారు. శుక్రవారం లక్ష్మణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో టీఆర్ఎస్ పాత్ర ఎంత ఉందో.. బీజేపీ పాత్ర కూడా అంతే ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి అనుమతులు సాధించింది తెలంగాణకు చెందిన బీజేపీ నేతలే అని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సహకారం కూడా ఉందన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఏది చెబితే అది నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా లేరన్నారు. చేనుకు నీరు.. చేతికి పని.. నినాదంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టు పనుల అంశం గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.
Published by:Srinivas Mittapalli
First published:June 21, 2019, 18:34 IST