తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఓ పెద్ద తప్పు చేశారని ఆరోపించారు. కేసీఆర్ పార్లమెంటును ఎలా తప్పుదారి పట్టించాడో త్వరలోనే ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఇందుకోసం లోక్‌సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ స్పీకర్ పర్మిషన్ ఇస్తే.. తెలంగాణ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు చెబుతామని ఆయన బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అదే జరిగితే కేసీఆర్ బండారం బయటపడుతుందని.. ఆ అంశం పార్లమెంటును కచ్చితంగా కుదిపేస్తుందని అన్నారు. అయితే ఆ విషయం ఏమిటన్నది ఇప్పుడు అడగొద్దని చెప్పారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక బండి సంజయ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు. మోసం చేయటంలో కేసీఆర్ ఏక్ నంబర్..కేటీఆర్ దస్ నంబర్ అని ఎద్దేవా చేశారు. న్యాయవాది వామనరావు హత్యపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేసి పొరపాటు చేయొద్దని కోరారు. రాజకీయ స్వార్థం కోసమే పీవీ నరసింహారావును సీఎం కేసీఆర్ వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఒకవేళ సీఎం కేసీఆర్‌కు పీవీపై ప్రేమ, గౌరవం ఉంటే.. పీవీ ఘాట్‌ను కూల్చుతామని ఎంఐఎం ప్రకటించినప్పుడు ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.