news18-telugu
Updated: October 27, 2020, 9:47 PM IST
ఆస్పత్రిలో దీక్ష విరమించిన బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ ఆస్పత్రిలో దీక్ష విరమించారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి సంజయ్ చేత దీక్ష విరమింపజేశారు. కరీంనగర్ బీజేపీ పార్టీ ఆఫీసులో దీక్షకు చేస్తున్న బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో... పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అయితే పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టి... బండి సంజయ్‌ను అక్కడిని నుంచి ఆస్పత్రికి తరలించారు.
నిన్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడకు బయలుదేరిన సంజయ్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించారు. దీంతో కరీంనగర్లో తన కార్యాలయంలో గత రాత్రి ఒంటరిగానే సంజయ్ దీక్షకు దిగారు. రాత్రి నుంచి కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు, పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. సీపీ భార్యను, పిల్లలను తనిఖీ చేస్తే తెలిసేదని... సీఎం కేసీఆర్ భార్యను, పిల్లలను తనిఖీ చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము ధైర్యం లేదని విమర్శించారు. ఓటమి భయంతో పిచ్చి పనులు చేస్తున్నారన్నారు. నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దుబ్బాకకు వస్తున్న డబ్బులు కేసీఆర్ ఫామ్ హౌస్వే అని..కేసీఆర్ ఫామ్ హౌస్‌ను తనిఖీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు ఖండించారు. కేంద్రం ఇచ్చే నిధుల్లో వాటాపై చర్చకు బండి సంజయ్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. డబ్బుతో రెడ్ హ్యాండెడ్ దొరికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బుతో పట్టుబడ్డ వ్యక్తే బీజేపీ అభ్యర్థివని చెప్పారని పేర్కొన్నారు. సమాచారం వస్తే అధికారులు సోదాలు చేయొద్దా? అని ప్రశ్నించారు. తమ వాహనాలు తనిఖీ చేశారని.. తాము సహకరించామని తెలిపారు. అనేక చోట్ల దాడులు అంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. మొత్తానికి తాజా వ్యవహారంతో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దుబ్బాకలో ఎన్నికల వేడిని మరింతగా పెంచాయి. ఇటు మంత్రి హరీశ్ రావు.. అటు బీజేపీ నుంచి అనేక మంది నేతలు దుబ్బాకలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
October 27, 2020, 9:03 PM IST