ప్రస్తుతం తెలంగాణబీజేపీ చీఫ్గా ఉన్న బండి సంజయ్.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తున్న బండి సంజయ్.. ఇందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్. ఆయన కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి గతంలో రెండుసార్లు పోటీ చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు అదృష్టం కలిసిరాలేదు. కానీ గత లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి అనూహ్యంగా విజయం సాధించిన బండి సంజయ్.. మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. ఆయనకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించిన బీజేపీ నాయకత్వం... ఆ తరువాత రాష్ట్రంలో తాము నమోదు చేస్తున్న విజయాలతో ఆయనపై మరింత నమ్మకంగా ఉంది.
ఇక బీజేపీ విధానాలతో దూకుడుగా ముందుకు సాగే బండి సంజయ్ సారథ్యంలోనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు కూడా బలంగా నమ్ముతున్నాయి. ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడయిన బండి సంజయ్.. గతంలో తాను పోటీ చేసిన కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా మరో స్థానం నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ స్థానానికి బదులుగా వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో బండి సంజయ్ ఉన్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గతకొంతకాలంగా బండి సంజయ్ వేములవాడపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట. అక్కడి నేతలతో తరచూ సమావేశమవుతున్నారని తెలుస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంతో పోల్చితే వేములవాడ అసెంబ్లీ సీటు తనకు చాలా సేఫ్ అని.. ఇక్కడి నుంచి పోటీ చేస్తే చేయడం వల్ల తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అయితే కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేయకూడదనే ఆలోచనకు బండి సంజయ్ రావడం వెనుక మరో కారణం కూడా ఉందనే చర్చ సాగుతోంది.
కరీంనగర్లో కొందరు బీజేపీ నేతలు బండి సంజయ్కు వ్యతిరేకంగా పని చేస్తున్నారట. దీనికి తోడు కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో మైనార్టీల ప్రభావం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని.. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ జరిగితే తనకు ఇబ్బంది కలుగుతుందనే భావనలో బండి సంజయ్ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బండి సంజయ్ వేములవాడ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనే విషయం వాస్తవమే అయినా.. అది కచ్చితంగా ఆయన పోటీ చేయడానికే అని చెప్పలేమనే వాదన కూడా ఉంది.
పౌరసత్వ వివాదం కారణంగా ప్రస్తుతం వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పదవిపై ఎప్పుడైనా వేటు పడొచ్చని.. అదే జరిగితే అక్కడ ఉప ఎన్నికలు ఖాయమని ప్రచారం సాగుతోంది. అక్కడ ఉప ఎన్నికలు వస్తే బీజేపీని గెలిపించుకోవడం ఎలా అనే దానిపై బీజేపీ ఫోకస్ చేస్తోందని.. ఈ కారణంగానే వేములవాడపై బండి సంజయ్ దృష్టి పెడుతున్నారేమో అనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి వేములవాడపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న బండి సంజయ్.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.