TELANGANA BJP NOT SO STRATEGICAL IN CANDIDATE SELECTION IN NAGARJUNA SAGAR BY ELECTION AK
Telangana: సాగర్‌లో ‘దుబ్బాక’ వ్యూహం కనిపించడం లేదా ? బీజేపీ ముందుగానే తడబడిందా ?
బండి సంజయ్ (ఫైల్ ఫోటో)
Telangana: సాగర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించడంతో పాటు భారీ మెజార్టీతో గెలవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అలా చేయడం వల్ల తెలంగాణలో బీజేపీ బలపడతుందనే వాదనలో వాస్తవం లేదని నిరూపించాలని యోచిస్తోంది.
తెలంగాణలో బలపడుతున్నట్టు కనిపించిన బీజేపీ.. సాగర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సాగర్‌లో ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో కమలనాథులు తర్జనభర్జన పడ్డారు. చివరి నిమిషంలో అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన అనివార్యత ఏర్పడంతో.. రవికుమార్ నాయక్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో సాగర్ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో బీజేపీ అందరికంటే ముందుగానే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. అక్కడ నుంచి రెండుసార్లు పోటీ చేసిన ఓడిపోయిన రఘునందన్ రావు తమ పార్టీ అభ్యర్థి అనే సంకేతాలను స్పష్టంగా ప్రజల్లోకి పంపింది. దీంతో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోయిన కొద్దిరోజులకే రంగంలోకి దిగి ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు రఘునందన్ రావు. స్వతహాగా మాటకారి అయిన రఘునందన్ రావు.. ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించారు. ఇక గతంలో రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది.
అయితే రఘునందన్ రావు విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు.. సాగర్‌లో అభ్యర్థి ఎంపిక సందర్భంగా వ్యవహరించలేదనే ఊహాగానాలు మొదలయ్యాయి. సాగర్ బరిలో బీజేపీ తరపున టికెట్ ఆశించిన వారిలో నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్ ఉన్నారు. వీరిలో ఒకరికి టికెట్ ఖాయమని అంతా అనుకున్నారు. టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తరువాత వీరలో ఒకరికి బీజేపీ టికెట్ ఇస్తుందని.. మరొకరిని బుజ్జగిస్తుందని చాలామంది భావించారు. కానీ బీజేపీ మాత్రం రవికుమార్ నాయక్ పేరును ఖరారు చేయడంతో ఈ ఇద్దరు బీజేపీకి యాంటీగా మారిపోయారు. నివేదితారెడ్డి రెబల్‌గా బరిలోకి దిగగా.. అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరి బీజేపీకి షాక్ ఇచ్చారు. దీంతో సాగర్‌లో బీజేపీ రాజకీయం అనుకున్నంత వ్యూహాత్మకంగా లేదనే చర్చ మొదలైంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు దక్కించుకున్న ఉత్సాహంతో టీఆర్ఎస్ ముందుకు సాగుతుండగా.. ఆ ఓటమి నుంచి తేరుకుని టీఆర్ఎస్తో తలపడాల్సిన పరిస్థితిలో బీజేపీ ఉంది. సాగర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించడంతో పాటు భారీ మెజార్టీతో గెలవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అలా చేయడం వల్ల తెలంగాణలో బీజేపీ బలపడతుందనే వాదనలో వాస్తవం లేదని నిరూపించాలని యోచిస్తోంది. మొత్తానికి దుబ్బాకలో అభ్యర్థి ఎంపిక విషయంలో ముందుగానే నిర్ణయం తీసుకున్న బీజేపీ.. సాగర్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతుందేమో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.