అద‌ృష్టం అంటే కిషన్‌ రెడ్డిదే.. చిన్న ఓటమితో పెద్ద గెలుపు దక్కిందిగా..

కిషన్ రెడ్డికి లక్ మామూలుగా లేదు. చిన్న ఎమ్మెల్యే పోస్టు పోయినా పే....ద్ద కేంద్ర మంత్రి పదవి ఆయన్ను వరించింది. ఓడిపోయిన తర్వాత కేవలం ఐదు నెలల్లోనే ఆయన లోక్‌సభకు పోటీ చేసి, గెలిచి.. కేంద్ర మంత్రి అయ్యారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: May 31, 2019, 7:17 AM IST
అద‌ృష్టం అంటే కిషన్‌ రెడ్డిదే.. చిన్న ఓటమితో పెద్ద గెలుపు దక్కిందిగా..
ప్రధాని మోదీతో కిషన్ రెడ్డి (ఫైల్)
  • Share this:
కిషన్‌ రెడ్డి.. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి. 14 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ముందస్తు ఎన్నికల్లో సుమారు వెయ్యి ఓట్ల తేడాతో ఓటమి చెందారు. గెలిస్తే మహా అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి శాసనసభాపక్ష నేత అయ్యేవారు. కానీ, ఆయనకు లక్ మామూలుగా లేదు. చిన్న ఎమ్మెల్యే పోస్టు పోయినా పే....ద్ద కేంద్ర మంత్రి పదవి ఆయన్ను వరించింది. ఓడిపోయిన తర్వాత కేవలం ఐదు నెలల్లోనే ఆయన లోక్‌సభకు పోటీ చేశారు. పార్టీ నాయకత్వం ఆయనకు సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. హోరాహోరీగా జరిగిన పోరులో 62 వేల భారీ మెజారిటీతో కిషన్‌ రెడ్డి గెలుపొందారు. దీంతో, రాష్ట్రం నుంచి కేబినెట్‌లో బెర్త్‌ అంటూ ఇస్తే కచ్చితంగా కిషన్‌ రెడ్డికే మొదటి అవకాశం వస్తుందని పార్టీ ముఖ్యులు భావించారు. నిజానికి 2014లోనే కిషన్ రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తారని, గెలిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక, అమిత్ షా నుంచి పిలుపు వచ్చే కంటే ముందు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

కిషన్ రెడ్డి గెలుపు ఖాయం అయినప్పటి నుంచే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. పార్టీ బలోపేతానికి ఆయనకు పదవి ఖాయం అని కూడా బీజేపీ నేతలు భావించారు. అయితే, కిషన్‌ రెడ్డికి కేబినెట్‌ బెర్త్‌ ఖాయంపై చివరి క్షణం వరకూ ఢిల్లీలో సస్పెన్స్‌ కొనసాగింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి పిలుపు వస్తుందని పార్టీ ముఖ్య నేతలు భావించినా బుధవారం రాత్రి వరకు రాలేదు. గురువారం ఉదయానికి నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఉదయం 11 గంటలకు కిషన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి చల్లని వార్త చెప్పారు. దీంతో, ఆయన అనుచరులు, మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు.

మూడు దశాబ్దాలుగా పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న కిషన్‌ రెడ్డి.. రాష్ట్ర పార్టీలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ప్రియ శిష్యుల్లో ఆయన ఒకరు. ప్రధాని మోదీ, అమిత్‌ షా వద్ద కష్టపడి పనిచేసే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ అగ్ర నేతలకు చేరువైన ఆయన, ఆ తర్వాత ఆ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ శాసనసభాపక్ష నేతగా చురుకైన పాత్ర పోషించారు.
First published: May 31, 2019, 7:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading