ఓటు వేస్తున్నారా? ఈవీఎం గురించి ఆసక్తికర విషయాలు

2013లో నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలకు ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్-వీవీప్యాట్‌లను ఉపయోగించారు. అంటే ఓటరు ఓటు వేసిన తర్వాత ఓ స్లిప్ వస్తుంది. ఆ తర్వాత డ్రాప్ బాక్సులో ఆ స్లిప్ పడిపోతుంది. ఈవీఎంలో నమోదైన ఓట్లు, డ్రాప్ బాక్సులో ఉన్న స్లిప్స్‌ మధ్య ఏదైనా తేడా ఉందా అని పరిశీలించేందుకు అవకాశముంది.

news18-telugu
Updated: December 6, 2018, 10:53 AM IST
ఓటు వేస్తున్నారా? ఈవీఎం గురించి ఆసక్తికర విషయాలు
ఈవీఎంలతో ఇప్పటి వరకు 3 సార్వత్రిక ఎన్నికలు, 113 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను కూడా ఈవీఎంల ద్వారానే నిర్వహించనున్నారు.
  • Share this:
తెలంగాణ ఎన్నికల యుద్ధంలో ఓ ఘట్టం ముగిసింది. ప్రచార పర్వానికి తెరపడింది. ఇక మిగిలింది పోలింగ్, ఓట్ల లెక్కింపు. పోలింగ్ అంటే... గతంలో బ్యాలెట్ బాక్సులు ఉండేవి. అభ్యర్థుల పేర్లను ఓ కాగితంపై ముద్రిస్తే... నచ్చినవారికి ఓటేసి, ఆ కాగితాన్ని మడతపెట్టి బ్యాలెట్ బాక్సుల్లో వేసేవాళ్లు. పోలింగ్ తర్వాత వాటిని లెక్కించేవాళ్లు. అయితే ఈ తరానికి ఇలాంటి ఎన్నికల పద్ధతి గురించి తెలిసింది తక్కువే. ఎందుకంటే... ఇప్పుడు అన్ని ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లే కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్... షార్ట్‌కట్‌లో ఈవీఎం. ఓటరు తీర్పును ఒడిసిపట్టే యంత్రం. నేతల తలరాతల్ని నిర్ణయించే మెషీన్. అసలు ఈవీఎంలు ఎవరు కనిపెట్టారు? ఏ ఎన్నికల్లో ఈవీఎంలను తొలిసారిగా ఉపయోగించారు? అసలు ఈవీఎం చరిత్ర ఏంటీ? తెలుసుకుందాం.

ఈవీఎం చరిత్ర

1980లో ఎంబీ హనీఫా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ను కనిపెట్టారు. అప్పట్లో ఆరు నగరాల్లో ఈవీఎంను ప్రదర్శనకు ఉంచారు. పలుమార్లు పరిశీలించి చూశారు. ఈవీఎం పనితీరు సరిగ్గా ఉండటంతో ఎన్నికల్లో ఉపయోగించాలని నిర్ణయించారు. అయితే తొలిసారి ఈవీఎం ఏ ఎన్నికల్లో ఉపయోగించారన్నదానిపై రెండు వాదనలున్నాయి. 1982లో కేరళలోని నార్త్ పరావుర్ ఉపఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించారని, 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలు వాడారని అంటారు. ఈవీఎంలు సత్ఫలితాలను ఇవ్వడంతో ఇక అన్ని ఎన్నికల్లో వాటిని ఉపయోగించాలని భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

1989లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా ఈవీఎంలు తయారు చేశాయి. ఐఐటీ బాంబేకు చెందిన ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ ఫ్యాకల్టీ సభ్యులు ఈవీఎంలు డిజైన్ చేశారు. ఆ తర్వాత రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించారు. అయితే ఈవీఎంలను పూర్తిస్థాయిలో ఉపయోగించింది మాత్రం 1999 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో.


2003లో అన్ని ఉప ఎన్నికల్లో, రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంలు వాడారు. ఆ తర్వాత 2004లో లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలు వాడారు. ఇక అప్పట్నుంచీ ప్రతీ ఎన్నికల్లో ఈవీఎం ఉపయోగిస్తున్నారు. 2013లో నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలకు ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్-వీవీప్యాట్‌లను ఉపయోగించారు. అంటే ఓటరు ఓటు వేసిన తర్వాత ఓ స్లిప్ వస్తుంది. ఆ తర్వాత డ్రాప్ బాక్సులో ఆ స్లిప్ పడిపోతుంది. ఈవీఎంలో నమోదైన ఓట్లు, డ్రాప్ బాక్సులో ఉన్న స్లిప్స్‌ మధ్య ఏదైనా తేడా ఉందా అని పరిశీలించేందుకు అవకాశముంది.

ఒక ఈవీఎంలో 3840 ఓట్లు వేయొచ్చు. 64 మంది అభ్యర్థుల వరకే ఈవీఎం సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక బ్యాలటింగ్ యూనిట్‌లో 16 చొప్పున 4 యూనిట్లు మాత్రమే కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 64 మంది అభ్యర్థులు దాటితే బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్ పద్ధతి ఉపయోగించాల్సిందే. ఒకరు ఒకసారికన్నా ఎక్కువగా బటన్ ప్రెస్ చేసే అవకాశముండదు. ఒకసారి బటన్ ప్రెస్ చేయగానే ఓటు రికార్డవుతుంది. మెషీన్ లాక్ అవుతుంది. మళ్లీ మళ్లీ బటన్స్ ప్రెస్ చేసినా ఓట్లు నమోదు కావు.


ఇక ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలోని రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆ ఈవీఎంలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తాయి. మొదటిసారి ఈవీఎం తయారు చేసినప్పుడు రూ.5,500 ఖర్చయింది. 2014 లో రూ.10,500 ఖర్చయింది. ప్రస్తుతం ఒక ఈవీఎం తయారీకి రూ.17,000 ఖర్చు చేస్తున్నారని అంచనా. లోక్‌సభ ఎన్నికలకు మొత్తం ఈవీఎంలు ఉపయోగిస్తే 10,000 టన్నుల బ్యాలెట్ పేపర్ ఆదా అవుతుంది. దాంతోపాటు కౌంటింగ్ ప్రక్రియ వేగవంతమవుతుంది. బోగస్ ఓటింగ్‌కు అవకాశముండదు. అయితే ఈవీఎంలు కూడా ట్యాంపర్ చేస్తారన్న అనుమానాలు, వాదనలు కూడా ఉన్నాయి.ఇవి కూడా చదవండి:

Telangana Election 2018: ఓటు మన బాధ్యత... ఇకనైనా వీడండి నిర్లిప్తత

ఓటర్ ఐడీ లేదా? ఈ కార్డు ఉంటే ఓటు వేయొచ్చు

Published by: Santhosh Kumar S
First published: December 6, 2018, 10:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading