ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్‌ పోల్ సర్వే అంటే ఏంటీ? ఎలా చేస్తారు?

Telangana Assembly Election 2018: వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్లు, ప్రైవేట్ సంస్థలు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తుంటాయి. రాజకీయ పార్టీలు కూడా స్వయంగా లేదా ప్రైవేట్ సంస్థల సహకారంతో సర్వేలు చేయిస్తాయి. అయితే వాటి ఫలితాలను బయటపెట్టాలని ఏమీ లేదు. అవసరాన్ని బట్టి సర్వేల ఫలితాలను వెల్లడిస్తాయి.

Santhosh Kumar S | news18-telugu
Updated: December 7, 2018, 6:23 PM IST
ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్‌ పోల్ సర్వే అంటే ఏంటీ? ఎలా చేస్తారు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎక్కువగా చర్చ జరిగేది ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్‌ పోల్ సర్వేల గురించే. వీటి గురించి జనం కంటే ఎక్కువగా చర్చించుకునేది రాజకీయ పార్టీలే. పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. అందుకే రాజకీయ పార్టీలు స్వయంగా ఈ సర్వేలు చేయించుకుంటాయి. అసలు ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్‌ పోల్ సర్వే అంటే ఏంటీ? ఎలా చేస్తారు? వాటి విశ్వసనీయత ఎంత? తెలుసుకుందాం.

ప్రీ పోల్ సర్వే

ఎన్నికల ముందు పలు పార్టీలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రీపోల్ సర్వే నిర్వహిస్తారు. 1824లో హ్యారీస్‌బర్గ్ పెన్సిల్వేనియా న్యూస్‌పేపర్ తొలిసారిగా ప్రీ పోల్ సర్వే నిర్వహించిందని చెబుతుంటారు. సర్వేలో పాల్గొనవాళ్లు పార్టీలపై ఉన్న తమ అభిప్రాయాన్ని చెబుతారు. వాటి ఆధారంగా ఫలితాలను అంచనా వేస్తారు సర్వే నిర్వాహకులు. సర్వేలో పాల్గొనవాళ్లు ఖచ్చితంగా ఓటు వేస్తారా? లేదా? అన్నది చెప్పడానికి లేదు. అసలు ఓటు లేనివాళ్లు కూడా ఈ సర్వేలో తమ అభిప్రాయం చెప్పొచ్చు. ఓటు విషయమే కాదు... వివిధ అంశాలపైనా సర్వే నిర్వహించేవాళ్లు ఓ ప్రశ్నావళి రూపొందించి అభిప్రాయాలు తెలుసుకుంటారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు ఖరారైనప్పుడు, పోలింగ్‌‌కు వారం ముందు... ఇలా దశల వారీగా ప్రీపోల్ సర్వే నిర్వహిస్తారు. తెలంగాణ ఎన్నికల విషయానికొస్తే షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 5 వరకు నిర్వహించినవన్నీ ప్రీపోల్ సర్వేలు. ఎన్నికలకు ముందు నిర్వహించే ఒపీనియన్ పోల్ కాబట్టి... ఓటర్ల అభిప్రాయం పోలింగ్ నాటికి మారొచ్చు. ఓటర్ల అభిప్రాయం అభ్యర్థులను ఎంపిక చేయకముందు ఒకలా, అభ్యర్థులను ప్రకటించినప్పుడు మరోలా, ప్రచార పర్వం ముగిసేనాటికి ఇంకోలా ఉండొచ్చు. సర్వేలో పాల్గొంటున్నవాళ్లు నిజమే చెప్పాలని ఏమీ లేదు. కాకపోతే ప్రజల మూడ్ అంచనా వేసేందుకు ఒపీనియన్ పోల్ ఉపయోగపడుతుంది.

ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటే ఏంటీ? ఎలా చేస్తారు? | Difference between opinion polls and exit polls?
ప్రతీకాత్మక చిత్రం
ఎగ్జిట్ పోల్ సర్వే
ఎగ్జిట్ పోల్ పోలింగ్ జరుగుతున్న సమయంలో చేసే సర్వే. అంటే ఓటర్లు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత నిర్వహించే అభిప్రాయ సేకరణ. అంటే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న డిసెంబర్ 7న ఓటు వేసినవారందరితో చేసే సర్వే. మొదటి ఎగ్జిట్ పోల్ ఎప్పుడు నిర్వహించారన్నదానిపై భిన్నమైన వాదనలున్నాయి. 1967 ఫిబ్రవరిలో డచ్ ఎన్నికల్లో సోషియాలజిస్ట్ మార్కెల్ వ్యాన్ డ్యామ్ తొలి ఎగ్జిట్ పోల్ నిర్వహించారన్న వాదన ఉంది. 1967 నవంబర్‌లో అమెరికన్ పోల్‌స్టర్ వారెన్ మిటోఫ్‌స్కీ తొలి ఎగ్జిట్ పోల్ చేశారన్న మరో వాదన ఉంది. అంతకంటే ముందే 1940లో కొలరడోలో ఎగ్జిట్ పోల్ చేశారన్నది మరో కథనం. కాకపోతే గతంలో ప్రీపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ఖచ్చితత్వం ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా తారుమారు అవుతున్నాయి. అయితే ఇప్పటికీ ఎగ్జిట్ పోల్ ఫలితాలనే నమ్మే పరిస్థితి ఉంది. కారణం... ఎగ్జిట్ పోల్‌ ఫలితాలు అసలు ఫలితాలకు కాస్త దగ్గరగా ఉంటాయన్న నమ్మకమే.

ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటే ఏంటీ? ఎలా చేస్తారు? | Difference between opinion polls and exit polls?
ప్రతీకాత్మక చిత్రం


పోస్ట్ పోల్ సర్వే
చాలామంది ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేలు వేర్వేరు. ఎగ్జిట్ పోల్ అంటే పోలింగ్ రోజున చేసేది. పోలింగ్ మరుసటి రోజు నుంచి ఫలితాలకు ముందు రోజు వరకు చేసేదే పోస్ట్ పోల్ సర్వే. అంటే తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ 7న జరుగుతున్నాయి కాబట్టి... 8, 9, 10వ తేదీల్లో జరిగేది పోస్ట్ పోల్ సర్వే. ఏ సర్వే అయినా ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా చేస్తారు. ఉదాహరణకు ఒక బూత్‌లో 1000 మంది ఓటర్లు ఉంటే వారిలో 50 మందిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ 50 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేస్తారు. అంటే 1000 మంది ఓటర్లను 50తో డివైడ్ చేస్తే 20 వస్తుంది. ఓటర్ లిస్ట్‌లో 12వ నెంబర్ ఓటర్‌ను ఎంపిక చేశారనుకోండి. ఆ తర్వాత 20, 20, 20 కలుపుతూ ఎవరి పేరు ఉంటే వాళ్లను ప్రశ్నిస్తారు.

ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటే ఏంటీ? ఎలా చేస్తారు? | Difference between opinion polls and exit polls?
ప్రతీకాత్మక చిత్రం


ఖచ్చితత్వం ఎంత?
ఎన్నికల ఫలితాల గురించి శాస్త్రీయంగా విశ్లేషించే శాస్త్రమే సెఫాలజీ. ఎన్నికలు మాత్రమే కాదు... వివిధ అంశాలపైనా సర్వేలు జరుగుతుంటాయి. వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్లు, ప్రైవేట్ సంస్థలు సర్వేలు నిర్వహిస్తుంటాయి. రాజకీయ పార్టీలు కూడా స్వయంగా లేదా ప్రైవేట్ సంస్థల సహకారంతో సర్వేలు చేయిస్తాయి. అయితే వాటి ఫలితాలను బయటపెట్టాలని ఏమీ లేదు. అవసరాన్ని బట్టి సర్వేల ఫలితాలను వెల్లడిస్తాయి. లేకపోతే తమ అవసరాల కోసం ఫలితాలను విశ్లేషించుకుంటాయి. ఈ సర్వేలు 100% ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేం. మార్జినల్ ఎర్రర్స్ ఉంటాయి. ఎక్కువగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారవుతుంటాయి. ఇందుకు పలు కారణాలు. సర్వే నిర్వహించేవారు ఓటర్లతో మాట్లాడి ఎవరికి ఓటు వేశారని తెలుసుకుంటారు. అయితే ప్రీపోల్‌ సర్వేలో అభిప్రాయం చెప్పినట్టుగా ఎగ్జిట్ పోల్‌లో ఓటర్లు స్వేచ్ఛగా అభిప్రాయం వెల్లడించకపోవచ్చు. ఎందుకంటే... చాలామందికి తాము ఎవరికి ఓటు వేశామో చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఇక్కడ కూడా ఓటర్లు అబద్ధం చెప్పే అవకాశముంది. అదే పోస్ట్ పోల్ సర్వే అయితే ఓటర్‌తో ఇంటిదగ్గర మాట్లాడి అభిప్రాయం తెలుసుకోవచ్చు. అక్కడ ఎలాంటి ఒత్తిడి ఉండదు కాబట్టి నిజాలు చెప్పే అవకాశాలు ఎక్కువ. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు మాత్రమే పోలింగ్ స్టేషన్ దగ్గర తాము ఫలానా వారికి ఓటేశామని స్వేచ్ఛగా వెల్లడిస్తారు. దీనివల్ల పబ్లిక్ పల్స్ తెలియదు. ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకోవడం మరో కారణం. ఎగ్జిట్ పోల్‌లో ప్రతీ 10వ ఓటర్‌ని ప్రశ్నించాలని అనుకుంటే... 10వ ఓటర్‌తో మాట్లాడుతుండగానే 30-40 మంది ఓటర్లు వెళ్లిపోవచ్చు. దీంతో శాంప్లింగ్ తేడా వస్తుంది.

ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటే ఏంటీ? ఎలా చేస్తారు? | Difference between opinion polls and exit polls?
ప్రతీకాత్మక చిత్రం


ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేల విషయంలో ఎన్నికల కమిషన్ కొన్ని నియమనిబంధనల్ని విధించింది. ఎన్నికల ప్రచారం గడువు ముగిసేలోపు మాత్రమే ప్రీపోల్ సర్వే వెల్లడించుకోవచ్చు. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం అన్ని విడతల పోలింగ్ ముగిసిన గంట తర్వాత వెల్లడించాలి. ప్రస్తుత పరిస్థితి తీసుకుంటే చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు ఎప్పుడో ముగిశాయి. కానీ... వాటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించలేదు. నిబంధనల ప్రకారం తెలంగాణ, రాజస్తాన్ ఎన్నికల పోలింగ్ ముగిసిన గంట తర్వాతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయాలి. ఈ నియమనిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126ఏ కింద కేసులు పెట్టొచ్చు.

ఇవి కూడా చదవండి:

ఓటు వేస్తున్నారా? ఈవీఎం గురించి ఆసక్తికర విషయాలు

Telangana Elections 2018: ఎన్నికల సిరా చరిత్ర తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: December 7, 2018, 1:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading