TELANGANA AGITATION LEADER CHERUKU SUDHAKAR MAY SOON CONGRESS REVANTH REDDY PLAN WORKS AK
Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ విలీనం.. ఫలించిన Revanth Reddy ప్లాన్..
రేవంత్ రెడ్డి (పైల్ ఫోటో )
Telangana: తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్న వారిని ఆకర్షించే విషయంలో కాంగ్రెస్ ఫెయిలవుతోందనే వాదనలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు రేవంత్ రెడ్డి చేసిన ఓ ప్రయత్నం ఫలించిందనే చర్చ జరుగుతోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాజకీయ వాతావరణం ఉండటంతో.. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇక టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ ఉద్యమనేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే విఠల్ వంటి నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. మరికొందరు నేతలతోనే బీజేపీ సంప్రదింపులు జరుపుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్న వాళ్లు తమతోనే ఉండేలా టీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. బయట ఉన్న వాళ్లను తమ పార్టీలో చేర్చుకోవడం.. తమ పార్టీలో ఉన్న అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది.
అయితే అలాంటి వారిని ఆకర్షించే విషయంలో కాంగ్రెస్ ఫెయిలవుతోందనే వాదనలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు రేవంత్ రెడ్డి చేసిన ఓ ప్రయత్నం ఫలించిందనే చర్చ జరుగుతోంది. గతంలో టీఆర్ఎస్‌లో ఉండి.. ఆ తరువాత కేసీఆర్‌తో విభేదించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న చెరుకు సుధాకర్.. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన స్థాపించిన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని తెలుస్తోంది. చెరుకు సుధాకర్, ఆయన భార్య లక్ష్మీ త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు సమాచారం.
కాంగ్రెస్‌లో చేరి తన భార్య లక్ష్మీని నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చెరుకు సుధాకర్ భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఈ సీటు దక్కించుకోవాలని చెరుకు సుధాకర్ ప్లాన్ చేశారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ సీటు తమ అనుచరుడైన చిరుమర్తి లింగయ్యకు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే కాంగ్రెస్ తరపున గెలిచిన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లో చేరారు.
దీంతో ఇప్పుడు కాంగ్రెస్ తరపున నకిరేకల్ సీటు తమకు దక్కే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్న చెరుకు సుధాకర్.. భార్యతో కలిసి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన హామీ లభించిన తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి జైలుకు కూడా వెళ్లొచ్చిన చెరుకు సుధాకర్‌ను పార్టీలోకి తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సైతం ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌ను ఒప్పించినట్టు టాక్ వినిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.