Graduate MLC Elections: ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంకు ఆ పార్టీల మద్దతు?

Graduate MLC Elections: ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంకు ఆ పార్టీల మద్దతు?

ప్రతీకాత్మక చిత్రం

Graduate MLC Elections: త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. తెలంగాణ జనసమితి నుంచి కోదండరాం, ఇంటి పార్టీ తరఫున చెరుకు సుధాకర్, యువ తెలంగాణ నుంచి రాణీ రుద్రమ పోటీ చేయడం దాదాపు ఖరారైంది. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని మరో సారి బరిలో నిలుపుతారన్న ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 • Share this:
  ఖమ్మం, వరంగల్‌, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలతో పాటు అనేక ఉద్యమ సంస్థలు, ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది ప్రముఖులు ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ తరఫును మాజీ జర్నలిస్టు రాణి రుద్రమ బరిలో నిలుస్తున్నారు. ఇంకా అనేక మంది ప్రముఖులు, ఉద్యమకారులు పోటీకి సిద్ధమవుతుండడంతో ఈ ఎన్నిక తెలంగాణ రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. వీరందరూ తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నవారే కావడంతో పట్టభద్రులు వీరిలో ఎవరికి పట్టం కడతారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం గెలుపే లక్ష్యంగా ఈ ఎన్నికల రంగంలోకి దిగుతోంది. మొదట ఆ పార్టీ నుంచి వివిధ పేర్లు వినిపించినా.. మరోసారి పల్లా రాజేశ్వర్‌రెడ్డినే బరిలో దించుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది.

  ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, వామపక్షాలు ఇంకా తమ వైఖరి ఏంటన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ కోదండరాంకు మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రస్తుతం రైతు సమన్వయ సమితికి రాష్ట్ర అధ్యక్షుడిగా క్యాబినెట్‌ హోదాలో ఉన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం సోడషపల్లి ఆయన సొంత ప్రాంతం. రాజేశ్వర్‌రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం అంతా ఖమ్మంలో సాగింది. అక్కడే ఆయన వామపక్ష విద్యార్థి సంఘంలో చురుకుగా పనిచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయనకు చెందిన అనురాగ్‌ గ్రూప్‌ విద్యాసంస్థలు ఉన్నాయి. మూడు జిల్లాల్లోనూ విస్తృతంగా ఉన్న పరిచయాలు ఆయనకు కలిసివచ్చే అశంగా చెప్పవచ్చు. మరో వైపు వామపక్ష ఉద్యమ నేపథ్యం ఉన్న జర్నలిస్టు పీవీ శ్రీనివాస్ సైతం తానూ పోటీలో ఉన్నానంటూ క్షేత్ర స్థాయిలో ఇప్పటికే మిత్రులను, శ్రేయోభిలాషులను కలుస్తున్నారు.

  ఇక అధికార పక్షానికి ధీటైన అభ్యర్థిగా ఉమ్మడిగా కోదండరాంను బలపర్చాలన్న ఆలోచనను గతంలో కాంగ్రెస్‌ సహా వామపక్షాలు చేసినట్లు సమాచారం. కోదండరాం ఇటీవల ఖమ్మం జిల్లా కూసుమంచిలో పర్యటించడం, అక్కడే ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ బలపర్చడం.. ఆ కొద్ది రోజులకు ఆ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు బత్తుల సోమయ్య సహా మరికొందరు పార్టీని వీడి తెలంగాణ ఇంటి పార్టీలో చేరడం తదితర పరిణామాలు వరుసగా జరిగిపోయాయి. ఈ అంశాలు ఆయనకు కొంచెం ఇబ్బంది కలిగించేలా మారాయి. ఇక యువ తెలంగాణ పార్టీ తరపున మాజీ జర్నలిస్టు రాణిరుద్రమ బరిలో దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

  టీఆర్ఎస్ విధానాలపై తన వాణిని వినిపించడంలో రాణిరుద్రమ సోషల్‌మీడియా వేదికగా యాక్టీవ్ గా పనిచేస్తున్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట ప్రాంతానికి చెందిన ఈమె కూడా స్థానికురాలే కావడం.. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పలు టీవీ చానళ్లు నిర్వహించిన కార్యక్రమాల్లో వాఖ్యాతగా వ్యవహరించడం ద్వారా ప్రజల్లో ఆమెకు గుర్తింపు ఉంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ తో పాటు, యువ తెలంగాణ పార్టీలు సోషల్‌మీడియా వేదికగా ఓట్ల చేర్పింపులపై చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రధాన పక్షాలైన కాంగ్రెస్‌, వామపక్షాలు ఇంకా ఈ ఎన్నికపై స్పష్టమైన వైఖరిని తీసుకోలేదు. అయితే అధికార టీఆర్ఎస్ ను కట్టడి చేయడానికి ప్రతిపక్షాలన్నీ ఓ వేదికపైకి చేరుతాయన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.
  Published by:Nikhil Kumar S
  First published: