ముదురుతున్న మాటల యుద్ధం... వైసీపీ-టీడీపీ మధ్య ట్విట్టర్ వార్

వైసీపీ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై టీడీపీ చేస్తున్న విమర్శలకు నిత్యం కౌంటర్లు ఇస్తున్న విజయసాయిరెడ్డికి దీటుగా బదులివ్వాలని టీడీపీ తాజాగా నిర్ణయించింది

news18-telugu
Updated: July 2, 2019, 9:00 AM IST
ముదురుతున్న మాటల యుద్ధం... వైసీపీ-టీడీపీ మధ్య ట్విట్టర్ వార్
విజయసాయిరెడ్డి, కేశినేని నాని
  • Share this:
ఏపీలో విపక్షంలో ఉండగానే నిత్యం పదునైన విమర్శలతో టీడీపీ అదినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.... అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన జోరు కొనసాగిస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లు మానేసి ఆయనకు ట్విట్టర్ లోనే దీటుగా సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి వర్సెస్ టీడీపీ వార్ సాగుతోంది. ఏపీలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి వర్సెట్ టీడీపీ ట్విట్టర్ వార్ ముదురుతోంది. గత టీడీపీ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబుతో పాటు మంత్రిగా ఉన్న ఆయన తనయుడు లోకేష్ ను ఉద్దేశించి పరుష పదజాలంతో విజయసాయిరెడ్డి విమర్శలు చేసేవారు. ప్రభుత్వ విధానాలతో ప్రారంభించి, కంపెనీలతో ఒప్పందాలు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్రంతో ఘర్షణ, బీజేపీతో విభేదించడం... ఇలా ఒకటేమిటి... ప్రతీ అంశంలోనూ టీడీపీ విధానాలను సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సూటిగా ప్రశ్నించేవారు. ఓ దశలో చంద్రబాబు, లోకేష్ లను నిప్పు, పప్పు అంటూ వ్యక్తిగతంగా విమర్శించే వరకూ వెళ్లారు. సాయిరెడ్డి తీరుపై టీడీపీ నేతలు బహిరంగంగానే ప్రెస్ మీట్లలో కౌంటర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారింది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డి మరింత జోరు పెంచారు. ఎన్నికలు జరిగిన తర్వాత, ఫలితాలు వెలువడ్డాక, అధికారం చేపట్టాక సాయిరెడ్డి గేరు మార్చారు. టీడీపీ లక్ష్యంగా మరింత దూకుడుగా విమర్శలు కొనసాగిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయే స్ధాయిలో ఆయన ట్వీట్లు ఉంటున్నాయనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఓ దశలో ప్రభుత్వం కూడా ఇరుకున పడే పరిస్ధితి కూడా తలెత్తుతోంది. సాధారణ ప్రజలతో పాటు సమాజంలో తటస్ధంగా ఉండేవారు, మేథావులు సైతం విజయసాయిరెడ్డి ట్వీట్లపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఈ రాజ్యసభ ఎంపీ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

వైసీపీ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై టీడీపీ చేస్తున్న విమర్శలకు నిత్యం కౌంటర్లు ఇస్తున్న విజయసాయిరెడ్డికి దీటుగా బదులివ్వాలని టీడీపీ తాజాగా నిర్ణయించింది. దీంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా ట్విట్టర్ వేదికగానే ఆయనకు కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు.

తొలుత విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రమే విజయసాయిరెడ్డికి కౌంటర్లు ఇచ్చేవారు, కానీ తాజాగా ఈ జాబితాలో లోకేష్, బుద్ధావెంకన్న, దివ్యవాణి తదితరులు కూడా విజయసాయిరెడ్డిపై విరుచుకుపడుతున్నారు. దీంతో విజయసాయిరెడ్డి వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. తాజాగా ఇవాళ కూడా బుద్దావెంకన్న సాయిరెడ్డిని ఉద్దేశించి అక్రమ సాయిరెడ్డి, పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ విరుచుకుపడ్డారు. మరో నేత దివ్యవాణి అయితే హెరిటేజ్ సొమ్ముతో ప్రజావేదిక కట్టారా అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు కౌంటర్ గా సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డు కోసం కేటాయించిన కోటి రూపాయలు భారతీ సిమెంట్స్ నుంచి ఇచ్చారా ? జగన్ ఇంటి దగ్గర టాయిలెట్స్ కోసం ఇచ్చిన 30 లక్షలు జగతి పబ్లికేషన్స్ నుంచి ఇచ్చారా అంటూ కౌంటర్లు సంధించారు. దీంతో ఈ ట్విట్టర్ వార్ ఎక్కడికి దారి తీస్తుందో అన్న ఆందోళన టీడీపీతో పాటు వైసీపీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.

వాస్తవానికి విజయసాయిరెడ్డి ట్వీట్లకు గతంలో నేరుగా ప్రెస్ మీట్ల ద్వారా సమాధానాలు ఇచ్చే టీడీపీ నేతలు.. తాజాగా రూటు మార్చారు. ప్రెస్ మీట్లకు ఖర్చు ఎందుకు అనుకున్నారో ఏమో కానీ తాము కూడా ట్వీట్ల ద్వారానే కౌంటర్లు వేస్తున్నారు.

(సయ్యద్ అహ్మద్,న్యూస్18,సీనియర్ కరస్పాండెంట్)
First published: July 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading