పోలవరం ప్రాజెక్టు సైట్లో 125 అడుగుల ఎత్తయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుపట్టారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లక్ష నిర్వాసితుల కుటుంబాలను గాలికొదిలేసిన జగన్ ప్రభుత్వం, వారి సమస్యలను పట్టించుకోకుండా, ప్రాజెక్ట్ ప్రదేశంలో 125 అడుగుల వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించడం, దానికి రూ.254.09కోట్లు నిధులు కేటాయించడం దారుణమన్నారు. వరదల సమయంలో పోలవరం నిర్వాసితులకు మంచినీరు, ఆహారం అందించలేని అసమర్థ ప్రభుత్వం, నిర్వాసితులు తహసీల్దార్ కార్యాలయాల వద్దచేస్తున్న ధర్నాలను పట్టించుకోకుండా, విగ్రహాలు పెట్టడమేంటన్నారు? పోలవరం పనులను గాలికొదిలేసి, నీటినిలువ సామర్థ్యాన్ని 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించి, చివరకు 125 అడుగుల వై.ఎస్. విగ్రహం పెట్టడానికే, ముఖ్యమంత్రి జగన్ మంత్రిని డ్యామ్ సైట్ కు పంపించారన్నారు. పోలవరం డ్యామ్ సైట్లో ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, నిర్వాకాలు అందరూ చూస్తున్నారని, తద్వారా జగన్మోహన్ రెడ్డి జాతి ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అని, కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో రాష్ట్రప్రభుత్వమే పనులు చేసిందని, దానికి అనుగుణంగానే చంద్రబాబునాయుడి హయాంలో ప్రాజెక్ట్ పనులు 71శాతానికి పైగా పూర్తిచేశామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరంలో ఒక్కశాతం కూడా పనులు చేయలేదని, విగ్రహాలు పెట్టడానికే ఈ 18నెలల సమయాన్ని ప్రభుత్వం వినియోగించినట్లుగా ఉందన్నారు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి (కేసీఆర్)తో లాలూచీపడి పోలవరం ఎత్తుని 15మీటర్లకు తగ్గించిన జగన్మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయాన్ని కూడా రూ.55,548కోట్లకు ఆమోదింపబడినా, కేంద్రపెద్దలను ఆ మొత్తానికి ఒప్పించలేకపోయారన్నారు.
నిర్వాసితుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వారేజగన్ ప్రభుత్వాన్ని పాతరేస్తారని ఉమా హెచ్చరించారు. చెమ్మచెక్క ఆటలాడుకుంటున్నారో... లేక చిన్నపిల్లల ఆటలా ఉందో తెలియడం లేదుగానీ, ఉభయగోదావరి జిల్లాల్లో 13 సైట్లు పరిశీలించాక, అంతిమంగా పోలవరం డ్యామ్ సైట్ స్థలనిర్దారణ జరిగిందన్నారు. ఎన్నోప్రభుత్వాలు మారి, ఎందరో ముఖ్యమంత్రులు శంఖుస్థాపనలు చేసినా, 2014 వరకు పనుల్లో పురోగతి లేదన్నా రు. కేంద్ర జలవనరులశాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పినా కూడా లెక్కచేయకుండా జగన్ ప్రభుత్వం పోలవరం విషయంలో ముందుకెళ్లిందన్నారు. చంద్రబాబునాయుడు తన హయాంలో జరిగిన పనులను ఎప్పటికప్పడు తెలియచేస్తే, జగన్ ఆ విధంగా ఎందుకుచేయలేకపోతున్నారని ఉమా ప్రశ్నించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన 18నెలల్లో పోలవరం అంశంలో కేంద్రానికి రాసిన లేఖలను బయటపెట్టాలని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ ను కూడా బహిర్గతం చేయాలని, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ మినిట్స్ ను వెల్లడించాలని దేవినేని డిమాండ్ చేశారు. రూ.600కోట్లు ప్రాజెక్ట్ కు ఖర్చుచేసినట్లు చెబుతున్న ఉత్తర కుమారుడు, డ్యామ్ సైట్లో ఏ విభాగంలో ఎన్నిపనులు చేశారో చెబితే ప్రజలు కూడా సంతోషిస్తారన్నారు. ఈ పిరికి ప్రభుత్వం చేసిన పనులను ఎందుకు చెప్పులేకపోతోందని, ఎన్నిలక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేసిందో, నిర్వాసితులకు ఎంత ఖర్చుచేసిందో చెప్పాలన్నారు.
వైఎస్ విగ్రహం పెట్టే ముందు ఆయన నిర్వాకంవల్లే, 2009లో పోలవరం పనులు రద్దయ్యాయని, దానివల్ల నాలుగేళ్లపాటు పనులు ఆలస్యమయ్యాయని, దానివల్ల ప్రాజెక్ట్ అంచనావ్యయంపై 2,537కోట్ల భారం పడిందనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు.