ఏపీ శాసనమండలిలో బీభత్సం... తన్నుకున్న మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీలు...

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, సత్యనారాయణ రాజు మధ్య గొడవ జరిగింది.

news18-telugu
Updated: June 17, 2020, 8:58 PM IST
ఏపీ శాసనమండలిలో బీభత్సం... తన్నుకున్న మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీలు...
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ (ఫైల్)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈరోజు బీభత్సం చోటుచేసుకుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి చెందిన సభ్యులు తన్నుకున్నారు. ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, సత్యనారాయణ రాజు మధ్య గొడవ జరిగింది. పరస్పరం ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. తోసుకున్నారు. శాసనమండలిలో మంత్రులు, ఎమ్మెల్సీ మధ్య గొడవను ఎమ్మెల్సీ నారా లోకేష్ వీడియో తీశారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. లోకేష్ తీరు మీద చైర్‌కు ఫిర్యాదు చేశారు. మండలిలో ఫొటోలు తీయవద్దని డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం లోకేష్‌ను వారించారు. ఈ సందర్భంగా ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించకుండానే శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.

అంతకు ముందు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ముందు చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. మొదట ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల డిమాండ్ చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు రాజ్యాంగపరమైన తప్పనిసరి కాబట్టి మొదట దానిపై చర్చించాలని, ఆ తర్వాత సమయాన్ని బట్టి మిగిలిన వాటిపై ఆలోచించవచ్చన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కూడా ద్రవ్యవినిమయ బిల్లుపై మొదట చర్చిద్దామన్నారు. ఈ ప్రతిపాదనకు వైసీపీ మంత్రులు అభ్యంతరం తెలిపారు. మొదట సీఆర్డీఏ, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపైనే చర్చించాలని డిమాండ్ చేశారు. అలాగే, ద్రవ్య వినిమయ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత మిగిలిన బిల్లులు ప్రవేశపెట్టిన సంప్రదాయం ఎప్పడూ లేదన్నారు. కాబట్టి, తొలుత ఈ రెండు బిల్లులపై చర్చించి, ఆ తర్వాత చివర్లో ద్రవ్య వినియమ బిల్లు పెట్టాలన్నారు. గతంలో ఎప్పుడూ ద్రవ్య వినిమయ బిల్లును ముందుగానే చర్చించిన సందర్భాలు లేవన్నారు. ఈ సందర్భంగా కొంతసేపు సభ వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన తర్వాత ఇలా కొట్టుకున్నారు. సభ ఆర్డర్‌లో లేదంటూ డిప్యూటీ చైర్మన్ సభను వాయిదా వేశారు.

అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పక్షాలు తమ వాదనే నెగ్గాలని పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో మంత్రులు, డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం మధ్య కూడా వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. సభలో సంప్రదాయాలు పాటించడం లేదంటూ అధికారపక్షం మండిపడింది. వైసీపీ ప్రభుత్వం రూల్స్  పాటించడం లేదని డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రమణ్యం కూడా మండిపడ్డారు. తనకు గన్ మెన్లను తీసేసి రోడ్డు మీద వదిలేశారని కూడా ఆయన ఆరోపించారు. అయితే, గతంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విషయంలో టీడీపీ ఎలా చేసిందో కూడా వైసీపీ మంత్రులు గుర్తు  చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 17, 2020, 8:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading